Gokavaram: గోకవరం మండలంలో పోలీసుల ప్రత్యేక చర్యలు ప్రమాదాల నివారణకు రేడియం డ్రమ్స్

Gokavaram: గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో వీరంకపల్లి, గుమ్మలదొడ్డి కూడళ్లలో రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక.

NARAYANA, RAJANAGARAM
Published on: 5 July 2026 2:51 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం మండలంలో పోలీసుల ప్రత్యేక చర్యలు ప్రమాదాల నివారణకు రేడియం డ్రమ్స్

గోకవరం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రమాదకర ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లతో కూడిన హెచ్చరిక డ్రమ్స్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో కూడా వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఈ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గోకవరం ఎస్‌ఐ వి.ఎస్.వి . పవన్ కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన గోకవరం మీదుగా ప్రతిరోజూ భారీ సంఖ్యలో వాహనాలు, పర్యాటకులు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఘాట్ రోడ్లు, వరుస మలుపులు ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తున్నందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు.

అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. గోకవరం హాట్స్పాట్ జంక్షన్ మండలంలో వీరంకపల్లి బావాజీపేట, గుమ్మలదొడ్డి గ్రామ కూడళ్లు తదితర ప్రమాదకర ప్రాంతాల్లో ఈ రేడియం హెచ్చరిక డ్రమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాద ప్రాంతాలను గుర్తించి ఇలాంటి భద్రతా చర్యలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.

"ఆగి... నెమ్మదిగా వెళ్లండి – మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది" అనే సందేశంతో ఏర్పాటు చేసిన ఈ హెచ్చరిక బోర్డులు వాహనదారుల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story