Mamidikuduru: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ గెద్దాడలో ఉచిత వైద్య శిబిరం
Mamidikuduru: పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాజోలు గెద్దాడలో ఉచిత వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొని అభినందించిన టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య.
Mamidikuduru: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ గెద్దాడలో ఉచిత వైద్య శిబిరం
Mamidikuduru: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నేదూరి బాబి ఆధ్వర్యంలో కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించారు.
ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నిస్వార్థ నటుడిగా, నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, సేవాభావం కలిగిన వ్యక్తిగా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన అభిమానులు కూడా అదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారని అమూల్య తెలిపారు. సేవా కార్యక్రమాలను అభిమాన ఉద్యమంగా మార్చిన ఘనత పవన్ కళ్యాణ్ అభిమానులకే దక్కుతుందని ఆమె అన్నారు.
ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు ముందుకు వచ్చిన నేదూరి బాబిని, వైద్య శిబిరానికి సహకారం అందించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని అమూల్య ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల పార్టీ నేత విత్తనాల జానకిరామ్, గ్రామ శాఖ అధ్యక్షులు గుబ్బల కృష్ణమూర్తి, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు జడ్డు చినరాజు, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు కొట్నాల నరసింహరావు, నేదూరి దామోదర్, నేదూరి వెంకట రామారావు, నేదూరి వెంకటేశ్వరరావు, సుంకర భూషణం, వినుకొండ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.




