Sakinetipalli: కోర్టు ఆదేశాలతో కిరణ్‌కుమార్ మృతదేహానికి ఎక్స్‌హ్యూమేషన్!
Sakinetipalli: సఖినేటిపల్లిలో అనుమానాస్పదంగా మృతి చెందిన కిరణ్‌కుమార్ మృతదేహాన్ని కోర్టు ఆదేశాల మేరకు సమాధి నుంచి వెలికితీసి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Sakinetipalli: కోర్టు ఆదేశాలతో కిరణ్‌కుమార్ మృతదేహానికి ఎక్స్‌హ్యూమేషన్!
సఖినేటిపల్లి: సఖినేటిపల్లి మండలంలోని సఖినేటిపల్లి గ్రామానికి చెందిన గొల్లమందల కిరణ్‌కుమార్ (40) అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఆయన సమాధిని తెరిచి మృతదేహాన్ని వెలికితీసి (ఎక్స్‌హ్యూమేషన్) వైద్య పరీక్షలకు తరలించారు.
కిరణ్‌కుమార్ 2025 మార్చి 6న విషపదార్థం సేవించడంతో మలికిపురంలోని సాయి సంజీవిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం మార్చి 13న డిశ్చార్జి అయ్యారు. అయితే మార్చి 15న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే కిరణ్‌కుమార్ మృతిపై అనుమానం ఉందంటూ ఆయన అక్క నిస్సి రాజాశ్రీ రాజోలు కోర్టును ఆశ్రయించారు. తన ఫిర్యాదులో కిరణ్‌కుమార్ భార్యతో పాటు పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో రాజోలు సీఐ, సఖినేటిపల్లి తహసీల్దార్, ఎస్‌ఐ, వైద్యుల బృందం, మధ్యవర్తుల సమక్షంలో గురువారం సమాధిని తెరిచి మృతదేహాన్ని వెలికితీశారు. వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా మృతికి గల అసలు కారణాన్ని నిర్ధారించనున్నట్లు తెలిసింది. కేసును రాజోలు సీఐ దర్యాప్తు చేస్తున్నారు.




