Rajole: అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలి: వక్తల డిమాండ్!
Rajole: రాజోలులో కోనసీమ అంబేడ్కర్ ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
Rajole: అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలి: వక్తల డిమాండ్!
రాజోలు: సమాజంలో సామాజిక అసమానతలు కొనసాగుతున్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని దళిత, బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాజోలు అంబేడ్కర్ సామాజిక భవనంలో కోనసీమ అంబేడ్కర్ షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెడబల రాజకుమార్ అధ్యక్షతన ‘రిజర్వేషన్ హఠావో ఉద్యమం–పరిణామాలు–భవిష్యత్ కార్యాచరణ’పై సమావేశం నిర్వహించారు.
ఏపీ హేతువాద సంఘం పూర్వ అధ్యక్షులు పెన్మెత్స సుబ్బరాజు మాట్లాడుతూ.. కుల, మత అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, సామాజిక వెనుకబాటుతనమే రిజర్వేషన్లకు ప్రాతిపదిక కావాలని అన్నారు. రిజర్వేషన్ హఠావో ఉద్యమం పేరుతో అలజడులు సృష్టించే ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో రిజర్వేషన్ అవకాశాలు తగ్గుతున్నాయని, సామాజిక సమానత్వం కోసం ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ పరిరక్షణకు బలమైన ఉద్యమం చేపట్టాలని, రిజర్వేషన్ హఠావో ఉద్యమంపై రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సమావేశం తీర్మానించింది.
ఈ కార్యక్రమంలో కుసుమ రాకేష్, తోటే రాజేష్, చింత శ్రీనివాసరావు, చాట్ల సత్యనారాయణ, తెన్నేటి త్రిమూర్తులు, కొంకి రాజమణి, ముగ్గు శ్రీనివాస్, నీతిపూడి గణేష్‌రావు, ఏ.రవి, ముత్యాల శ్రీనివాసరావు, పి.పవన్, చెవ్వాకుల వెంకట్, భూపతి వెంకటపతి, విప్పర్తి సాయిబాబు, శెట్టిబత్తుల ఎలిజబెత్ రాణి, ఆకుమర్తి భూషణం, నల్లి ప్రసాద్, దీపాటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




