Rampachodavaram: సిఎం పర్యటన వేదికగా గిరిజన సమస్యలు పరిష్కరించాలి!
Rampachodavaram: పోలవరం ఆర్‌అండ్ఆర్, జీవో 3, పోడు పట్టాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బోప్పెన కిరణ్ డిమాండ్.
Rampachodavaram: సిఎం పర్యటన వేదికగా గిరిజన సమస్యలు పరిష్కరించాలి!
Rampachodavaram: రంపచోడవరం పర్యటనలో గిరిజనుల ప్రాథమిక హక్కులు, నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలి..!
— సి.పి.ఎం. పోలవరం జిల్లా కమిటీ డిమాండ్
ఈ నెల 24న పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యలను పరిష్కరించేందుకు ఈ పర్యటన వేదిక కావాలని సీపీఎం పోలవరం జిల్లా కార్యదర్శి బొప్పెన. కిరణ్ డిమాండ్ చేశారు. కేవలం సభలకే పరిమితం కాకుండా, గిరిజన ప్రాంతాల నిజమైన అభివృద్ధికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరుతున్నాం.
ఈ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి, పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు:
1. పోలవరం నిర్వాసితుల పునరావాసం (R&R) మరియు పూర్తి నష్టపరిహారం:
ఏజెన్సీ పరిధిలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని (R&R Package) యుద్ధ ప్రాతిపదికన అందించాలి. కాలనీల్లో కనీస మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రహదారులు కల్పించాలి. కాంటూర్ తో సంబంధం లేకుండా అన్ని గ్రామాలకు ఓకే కాంటూరు కింద నష్టపరిహారం ఇవ్వాలి.
2. 'జిఓ నెం. 3' పునరుద్ధరణ & గిరిజన హక్కుల పరిరక్షణ:
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన నిరుద్యోగుల ఉపాధి హక్కులను కాపాడే విధంగా చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలి. 1/70 చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని (FRA) పకడ్బందీగా అమలు చేసి, గిరిజనుల సాగు భూములకు హక్కు పత్రాలు (పోడు పట్టాలు) తక్షణమే మంజూరు చేయాలి.
3. ఏజెన్సీలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు:
రంపచోడవరం గిరిజన ప్రాంతంలో మాతా శిశు మరణాలను అరికట్టడానికి, వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులు, రక్తహీనత వంటి సమస్యలను ఎదుర్కొనడానికి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి ఆధునీకరించాలి. మారుమూల గిరిజన గ్రామాలకు ఆంబులెన్స్, మెరుగైన రవాణా వసతులు కల్పించాలి.
4. మౌలిక వసతులు & రహదారుల నిర్మాణం:
రంపచోడవరం నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాలకు నేటికీ సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు పడుతున్న అవస్థలను గుర్తించి, అన్ని గూడేలకు పక్కా రహదారులు, వంతెనల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి.
5. విద్య & గిరిజన ఆశ్రమ పాఠశాలల బలోపేతం:
ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. డిజిటల్ విద్యతో పాటు పాఠశాలల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించాలి.
6. గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర & గిరిజన వికాసం:
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు (GCC ద్వారా) మద్దతు ధర పెంచి కొనుగోలు చేయాలి. స్థానిక గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు ఏజెన్సీ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.
పోలవరం జిల్లాలోని సుందరమైన గిరిజన ప్రాంతం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతోంది. ముఖ్యమంత్రి గారి పర్యటన అధికారుల హడావుడికే పరిమితం కాకుండా, స్థానిక ప్రజల, గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఉండాలనీ ఆయన డిమాండ్ చేశారు.




