Malikipuram: సీపీఐ ధర్నా..నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్!
Malikipuram: మలికిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా. నిత్యావసరాల ధరలు తగ్గించి ప్రజలు, రైతులను ఆదుకోవాలని వినతిపత్రం సమర్పణ.
Malikipuram: సీపీఐ ధర్నా..నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్!
Malikipuram: నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలు భరించలేని స్థాయికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచదార కిలో రూ.70, ఉల్లిపాయలు రూ.65, మంచినూనె రూ.185, కందిపప్పు రూ.130 వరకు ధరలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం తీవ్రంగా పెరిగిందన్నారు. ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడం వల్ల రైతులపై మరింత ఆర్థిక భారం పడుతోందన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. తక్షణమే కరువు మండలాలను గుర్తించి రైతులు, రైతు కూలీలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆక్వా రంగంపై కూడా పెరుగుతున్న ధరల ప్రభావం తీవ్రంగా ఉందని, రొయ్యల మేత ధరలను తగ్గించి ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం వెంటనే నియంత్రించకపోతే ప్రజల సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాజోలు నియోజకవర్గ కార్యదర్శి చెల్లుబోయిన తాతారావు, సహాయ కార్యదర్శి దొండపాటి చిట్టిరాజు, పిచ్చిక గంగాధరరావు, డి. భానోజీ, కొండ సత్తిబాబు, దేవ రమేష్, వి. చిట్టిబాబు, గంటా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




