Rajahmundry: రాజమండ్రిలో బిఎల్ఓలకు శిక్షణ కమిషనర్ రాహుల్ మీనా స్పష్టత!
Rajahmundry: రాజమండ్రిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బిఎల్ఓలకు శిక్షణ ఇచ్చారు. నో-మ్యాపింగ్ ఓటర్లకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.
Rajahmundry: రాజమండ్రిలో బిఎల్ఓలకు శిక్షణ కమిషనర్ రాహుల్ మీనా స్పష్టత!
Rajahmundry: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం నాన్ మ్యాపింగ్, తార్కిక వ్యత్యాసాలు(లాజికల్ డిస్క్రిపెన్సీలు) ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయవలసి ఉందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు.
పారదర్శక ఓటర్ల జాబితా తయారీపై ఏఈఆర్ఓలు, బి.ఎల్.ఓ.లు, సూపర్‌వైజర్లకు మంగళవారం ఆనం కళాకేంద్రం నందు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ యాప్ వినియోగం, ఖచ్చితమైన సమాచార సేకరణ ప్రాముఖ్యత వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ అర్బన్ పరిధిలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం మ్యాపింగ్ చేయించుకోని 29,880 మంది ఓటర్లకు నోటీసులు జారీచేయవలసి ఉందన్నారు. నోమ్యాపింగ్ ఓట్లతోపాటు జాబితాలో ఇంటి పేరు లేదా పేరులో అక్షర దోషాలు ఉన్న వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల అధికారుల ఎదుట హాజరై అవసరమైన ఆధారాలు సమర్పించవలసి ఉంటుందన్నారు. ఆధార్ మినహా ప్రభుత్వం గుర్తించిన ఇతర గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించి తమ అర్హతను నిరూపించుకోవాలన్నారు.
వారిచ్చే వివరణల్లో స్పష్టత లేకుంటే అక్టోబరులో వెలువడనున్న తుది జాబితాలో పేర్లు ఉండవని.. కనుక బీఎల్వోలు, సూపర్ వైజర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
అదేవిధంగా శిక్షణా తరగతులను పూర్తిగా సద్వినియోగపరచుకుని కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తిచేయవలసిందిగా సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎమ్మార్వో రంజిత్ కుమార్, ఏఈఆర్ఓలు, సూపర్ వైజర్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు.




