Amalapuram: బీఎల్వోలకు సహకరించాలన్న కోనసీమ జిల్లా కలెక్టర్!
Amalapuram: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ 99 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు.
Amalapuram: బీఎల్వోలకు సహకరించాలన్న కోనసీమ జిల్లా కలెక్టర్!
అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ 99 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఓటరు సహకరించాలని కోరారు.
మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఆత్రేయపురం మండలంలో మాత్రమే 54,769 మంది ఓటర్లలో 54,550 మంది వివరాల సేకరణ పూర్తయిందని, మరో 219 మంది వివరాలు నమోదు చేయాల్సి ఉండటంతో అక్కడ 99 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తూ జాబితాలోని లోపాలను సరిదిద్దుతున్నారని కలెక్టర్ చెప్పారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. బీఎల్‌వోలు అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి వెంటనే అందజేసి ఓటర్లందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




