Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శత కలశాభిషేకం!

Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 15 Sept 2026 6:22 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శత కలశాభిషేకం!

అంతర్వేది: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా బుధవారం అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాలను ఏర్పాటు చేసి, ప్రతి కలశంలో స్వామివారి 108 అష్టోత్తర నామాలతో ఆవాహనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ప్రధాన కలశాన్ని శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. తదుపరి 108 కలశాల్లోని పవిత్ర జలాలతో స్వామివారికి పంచామృతాలతో కలిపి విశేష అభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

అభిషేక కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కె.టి.ఎన్.వి. ప్రసాద్ తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE