Amalapuram: గణేష్ మండపాలకు APEPDCL విద్యుత్ భద్రతా సూచనలు

Amalapuram: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా APEPDCL ఎస్ఈ పలు భద్రతా సూచనలు జారీ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 10 Sept 2026 5:36 PM IST
Amalapuram
X

Amalapuram: గణేష్ మండపాలకు APEPDCL విద్యుత్ భద్రతా సూచనలు

అమలాపురం: వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) విజ్ఞప్తి చేశారు.

మండపాలకు విద్యుత్ సరఫరా కోసం అధికారిక తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను మాత్రమే తీసుకోవాలని సూచించారు. అనధికారిక కనెక్షన్లు, విద్యుత్ దొంగతనానికి పాల్పడటం చట్టవిరుద్ధమే కాకుండా ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. విద్యుత్ పనులను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్లు లేదా సర్టిఫైడ్ నిపుణులతోనే చేయించుకోవాలని తెలిపారు.

విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, బహిరంగ కేబుల్స్‌కు సురక్షిత దూరంలో మండపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండపంలో ప్రత్యేక ఎర్తింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ISI గుర్తింపు కలిగిన నాణ్యమైన వైర్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. తెగిన, సడలిన వైర్లతో పాటు మల్టీ ప్లగ్‌లను అధిక లోడ్‌కు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

MCB, ELCBలతో కూడిన వాటర్‌ప్రూఫ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులను (DB Box) ఏర్పాటు చేయాలని సూచించారు. తక్కువ విద్యుత్ వినియోగం, తక్కువ వేడిని ఉత్పత్తి చేసే LED లైట్లను మాత్రమే వినియోగించాలని, లైట్లు, సీరియల్ సెట్ వైర్లు గోడలు లేదా లోహ వస్తువులకు నేరుగా తగలకుండా అమర్చాలని తెలిపారు. మీటర్లు, విద్యుత్ వైర్లకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు.

విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సమయంలో విద్యుత్ లైన్లు తగలకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాకాలం కావడంతో విద్యుత్ పరికరాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. పూలమాలలు, కాగితం, ప్లాస్టిక్ తదితర మండే వస్తువులను విద్యుత్ లైట్లకు దూరంగా ఉంచాలన్నారు.

విద్యుత్ పరికరాల్లో స్పార్కింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ గమనించిన వెంటనే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసి, నిపుణుల సహాయం తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ పరికరాలను భక్తులు, సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా భద్రపరచాలని సూచించారు.

ప్రజలందరూ విద్యుత్ భద్రతా నిబంధనలు పాటించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆనందంగా, సురక్షితంగా వినాయక చవితి మరియు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని APEPDCL తరఫున SE కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story