Unmadam OTT Review: మైండ్ గేమ్‌లతో మైమరపించే మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్
Unmadam OTT Review: మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు కుంచాకో బోబన్. ఇటీవల 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' చిత్రంతో డిజిటల్
unmadham
Unmadam OTT Review: మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు కుంచాకో బోబన్. ఇటీవల 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' చిత్రంతో డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఆయన, తాజాగా 'ఉన్మాదం' అనే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌తో మళ్లీ ముందడుగు వేశారు. కిరణ్ దాస్ దర్శకత్వంలో లిజోమోల్ జోస్ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం, జులై 31న థియేటర్లలో సందడి చేశాక, ఇప్పుడు 'సోనీలివ్' ప్లాట్‌ఫారమ్‌లో మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సినిమాపై పిచ్చి... ఓ విచిత్రమైన కేసు
పాలక్కాడ్ లోని ఓ సాధారణ పోలీస్ స్టేషన్‌లో 'షెల్లీ' (కుంచాకో బోబన్) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. భార్య సౌమ్య (లిజోమోల్ జోస్) ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిరిత్య పోలీసు అయినప్పటికీ, షెల్లీకి సినిమాలపై అమితమైన ప్రాణం. ఎలాగైనా మంచి సినిమా రచయితగా మారాలనే బలమైన కోరికతో తరచూ సెలవులు పెట్టి మరీ స్క్రిప్టులు రాస్తుంటాడు. భార్య అసహనం వ్యక్తం చేస్తున్నా తన ప్రయత్నాన్ని వీడడు.
ఈ క్రమంలోనే ఆ పోలీస్ స్టేషన్‌లో ఏళ్ల తరబడి మూలనపడి ఉన్న ఒక మిస్టరీ ఫైల్ గురించి షెల్లీకి తెలుస్తుంది. ఆరేళ్ల క్రితం రైలు పట్టాల పక్కన శవమై కనిపించిన ఒక యువతికి సంబంధించిన కేసు అది. ఆ ఫైల్‌ను ముట్టుకున్న అధికారులు సస్పెండ్ కావడం లేదా ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు జరగడంతో, ఆ యువతి ఆత్మ తిరుగుతోందనే భయంతో దానిని అందరూ పక్కన పెట్టేస్తారు.
అనుమానాలు... ఉత్కంఠ రేపే మలుపులు
ఆ క్రైమ్ సంఘటన ఆధారంగా షెల్లీ ఒక లైన్ సిద్ధం చేసుకుని ఒక దర్శకుడికి వినిపించగా, ఆయనకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రాయమని అడ్వాన్స్ ఇస్తాడు. దాంతో నిజంగానే ఆ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో, స్టేషన్‌లో అందరూ భయపడే ఆ ఫైల్‌ను షెల్లీ రహస్యంగా ఓపెన్ చేస్తాడు. ఆ ఫైల్ వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? నిరూపించబడని ఆ కేసును బయటకు తీసినందుకు షెల్లీ ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి? ఆ అమ్మాయి చావు వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన ఎలా బయటపెట్టాడనేదే కథలోని ప్రధానాంశం.
పట్టు బిగించే ద్వితీయార్థం – క్లైమాక్స్ హైలైట్
చిత్రం మొదటి భాగం షెల్లీ వ్యక్తిగత జీవితం, భార్యతో చిన్నపాటి గొడవలు , కథల కోసం చేసే ప్రయత్నాలతో ప్రశాంతంగా సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో ఎప్పుడైతే కథానాయకుడు ఆ పాత ఫైల్‌ను పరిశీలించడం ప్రారంభిస్తాడో, కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. నిజంగానే ప్రేతాత్మ ఉందా లేక అదంతా ఒక భ్రమా అనే ఉత్కంఠ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. ఆరంభంలో కాస్త నిదానంగా సాగినప్పటికీ, చివరి 40 నిమిషాల వ్యవధిలో వచ్చే చకచకా మారే మలుపులు, ప్రీ-క్లైమాక్స్ , క్లైమాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. దెయ్యాలను నేరుగా చూపించి భయపెట్టకుండా, ఆ అభూతభయం ప్రభావాన్ని స్క్రీన్ ప్లే అంతటా ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం.
సాంకేతిక బలం , నటీనటుల ప్రదర్శన
సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించిన కుంచాకో బోబన్, నటనలో మరొకసారి తన మార్కు చూపించారు. శత్రువులు తనను పిచ్చివాడిగా చిత్రీకరించాలని చూసినా, అన్యాయానికి గురైన ఒక అమ్మాయికి న్యాయం చేయాలనే పట్టుదలతో పోరాడే పాత్రలో ఆయన జీవించారు. లిజోమోల్ జోస్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అర్జున్ సేతు ఛాయాగ్రహణం, జస్టిన్ వర్గీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జితిన్ జాన్ ఎడిటింగ్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన సరైన మూడ్‌ను తీసుకొచ్చాయి. క్రైమ్, మిస్టరీ, మైండ్ గేమ్స్ ప్రాధాన్యత ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుంది.




