Thadayam OTT: త‌మిళ‌నాడు, ఏపీల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ఇద్ద‌రు సీరియ‌ల్ కిల్ల‌ర్స్‌.. ఓటీటీలో రియ‌ల్ లైఫ్ స్టోరీ

Thadayam OTT: నిజ జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Mokshith
Published on: 5 April 2026 6:51 PM IST
Thadayam OTT Review Real Serial Killers Story That Shook Andhra Pradesh and Tamil Nadu
X

Thadayam OTT

Thadayam OTT: నిజ జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో రియల్ క్రైమ్ కథలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కోవకు చెందిన వెబ్ సిరీస్‌నే “తడయం”. ఇంత‌కీ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.? క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

త‌డ‌యం సిరీస్ కథ 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రూపొందించారు. తిరువళ్లూరు సమీపంలోని ప్రాంతాల్లో జరిగిన సీరియల్ హత్యల కేసులను ప్రధానంగా తీసుకుని కథను తెరకెక్కించారు. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఇందులో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు నవీన్ కుమార్ పళనివేల్ ఈ సిరీస్‌ను రూపొందించగా, నిర్మాతగా అజయ్ కృష్ణ వ్యవహరించారు.

శివదా, సుందర్ పాండియన్, మున్నార్ రమేశ్, రాజ్ తిరందాస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీనికి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

వరుస హత్యల వెనుక దాగిన రహస్యం

కథ 1995 ప్రాంతంలో ప్రారంభమవుతుంది. తిరువళ్లూరు సమీపంలోని పొడతూర్‌పేట ప్రాంతంలో వరుసగా ఒకే విధమైన పద్ధతిలో హత్యలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న దంపతులనే టార్గెట్ చేస్తూ ఇద్ద‌రు వ్య‌క్తులు హ‌త్య‌లు చేస్త్ఉంటారు. అయితే వారు దోపిడీ కోసం హత్యలు చేయరు. ప్రతి ఘటనలో మహిళల మంగళసూత్రం, పురుషుల నడుము గొలుసు మాత్రమే తీసుకుని వెళ్తారు. అంతేకాదు, ప్రతి క్రైమ్ సీన్ వద్ద రక్తంతో క్వ‌శ్చ‌న్ మార్క్‌ (?) వదిలి వెళ్లడం కేసును మరింత మిస్టీరియస్‌గా మారుస్తుంది. ఇలా వరుసగా జరిగే ఈ హత్యలు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తాయి. పోలీసులు కూడా ఈ కేసును ఛేదించడంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు.

దర్యాప్తులో షాకింగ్ నిజాలు

ఈ హత్యల మిస్టరీని ఛేదించడానికి ఎస్‌ఐ లక్ష్మీ అనే పోలీస్ అధికారి రంగంలోకి దిగుతుంది. కేసు క్లిష్టంగా ఉండటంతో ఆమె ఒక సీనియర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సహాయం తీసుకుంటుంది. ఇప్పటికే వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసిన ఆ అధికారి అనుభవంతో దర్యాప్తులో భాగమవుతాడు. ఇద్దరూ కలిసి కేసును లోతుగా పరిశీలించగా అనూహ్యమైన విషయాలు బయటపడతాయి. సాధారణంగా కనిపించిన ఈ హత్యల వెనుక సీరియల్ కిల్లర్స్ గ్యాంగ్ ఉందని, వారు మొత్తం 77 హత్యలు చేసినట్టు తెలుస్తుంది.

ఇంత‌కీ ఆ కిల్లర్లు ఎవరు? వారు ఎందుకు ఈ విధంగా హత్యలు చేస్తున్నారు? ఆ ప్రశ్నార్థక గుర్తు వెనుక అసలు అర్థం ఏమిటి? చివరికి పోలీసులు వారిని పట్టుకోగలిగారా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే “తడయం” వెబ్ సిరీస్‌ను చూడాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్ కథలు ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పొచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story