Musafir Cafe Review : ప్రేమకు, లక్ష్యాలకు నడుమ సాగే భావోద్వేగ పయనం.!

Musafir Cafe Review : విక్రాంత్ మాస్సే, వేదిక పింటో ప్రధాన పాత్రల్లో నటించిన తాజా రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ 'ముసాఫిర్ కేఫ్'..

G Krishna
Published on: 30 July 2026 4:49 PM IST
Musafir Cafe Review
X

Musafir Cafe Review

Musafir Cafe Review : విక్రాంత్ మాస్సే, వేదిక పింటో ప్రధాన పాత్రల్లో నటించిన తాజా రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ 'ముసాఫిర్ కేఫ్' (Musafir Cafe). రుచిర్ అరుణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జులై 24, 2026 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ , వ్యక్తిగత ఆశయాల మధ్య నలిగిపోయే మానసిక సంఘర్షణను, అనుబంధాల లోతును ఆకట్టుకునేలా ఆవిష్కరించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

వైవిధ్యమైన కలలు.. ఒక్కటైన మనసులు

మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేసే చంద్రమోహన్ శర్మ అలియాస్ చందర్ (విక్రాంత్ మాస్సే) తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు. పెళ్లి చూపుల సందర్భంగా అతనికి సుధ (వేదిక పింటో) పరిచయమవుతుంది. మొదటి చూపులోనే ఇద్దరి ఆలోచనలు, జీవిత దృక్పథాలు వేరు అని చందర్ భావిస్తాడు. కానీ అనుకోకుండా భోపాల్‌లో వీరిద్దరూ మళ్లీ కలవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సుధ, తల్లి పడిన కష్టాలను దగ్గరుండి చూస్తుంది. ముంబైలో లాయర్‌గా స్థిరపడి తల్లికి మంచి జీవితాన్ని ఇవ్వాలనేది ఆమె బలమైన కోరిక. ఆ లక్ష్యం నెరవేరే వరకు పెళ్లి వద్దనుకునే సుధ, అదే విషయాన్ని చందర్‌కు స్పష్టంగా చెప్పి అతనితో కలిసి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. మరోవైపు ప్రకృతిని, కాఫీని ప్రేమించే చందర్ కనుల నిండా కొండల మధ్య ఒక ప్రశాంతమైన కేఫ్ తెరిచి హాయిగా జీవించాలనే కల ఉంటుంది.

అయితే, వీరిద్దరి బంధంలోకి ప్రీతి అనే మరో అమ్మాయి ప్రవేశించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు ప్రీతి ఎవరు? సుధ తన ముంబై కలను నెరవేర్చుకుందా? చందర్ తన కేఫ్ కలను సాకారం చేసుకున్నాడా? చివరికి చందర్, సుధలు ఒకటయ్యారా లేదా అనే విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే..

నెమ్మదిగా మొదలై ఆకట్టుకునే ఎమోషన్స్

లక్ష్య సాధన వర్సెస్ అనుబంధాలు అనే కోణంలో ఈ సిరీస్ సాగుతుంది. "మన కలలను నెరవేర్చుకోవడమే జీవితానికి అర్థం" అని సుధ నమ్మితే, "తన ప్రేమే తన కల , నిజం" అని చందర్ భావిస్తాడు. ఈ రెండు విభిన్న మనస్తత్వాల మధ్య వచ్చే భావోద్వేగ ఘర్షణే ఈ సిరీస్‌కు ప్రధాన బలం.

దర్శకుడు రుచిర్ అరుణ్ చందర్ భూతకాలాన్ని (సుధతో ఉన్న బంధం), వర్తమానంతో (ప్రీతితో ఉన్న జీవితం) సమాంతరంగా చూపిస్తూ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించారు. దీనివల్ల చందర్, సుధలు ఎందుకు విడిపోయారు? ప్రీతి అతని జీవితంలోకి ఎలా వచ్చింది? అనే ఉత్సుకత వీక్షకుల్లో చివరివరకు కొనసాగుతుంది. మొదటి మూడు ఎపిసోడ్లు కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, నాల్గో ఎపిసోడ్ నుండి కథలో వేగం పెరిగి భావోద్వేగ దృశ్యాలు హృదయానికి హత్తుకుంటాయి.

నటీనటుల పనితీరు: వేదిక పింటో అద్భుత నటన

చందర్ పాత్రలో విక్రాంత్ మాస్సే మరోసారి తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో అసలైన సర్ ప్రైజ్ ఎలిమెంట్ మాత్రం వేదిక పింటోనే. సుధ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, హావభావాలు, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూస్తే సీనియర్ నటి త్రిష గుర్తుకువచ్చినప్పటికీ, తన సొంత మార్కును స్పష్టంగా చూపించారు. మహిమా మక్వానా , ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేర మెప్పించి కథకు బలాన్నిచ్చారు.

సాంకేతిక విభాగం విషయానికొస్తే..

దర్శకుడు రుచిర్ అరుణ్ పరిణతి చెందిన కథనంతో ఈ ప్రేమకథను తీర్చిదిద్దారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఎమోషనల్ సీన్లను నడిపించిన తీరు ప్రశంసనీయం. అనిరుద్ధ్ అందించిన సినిమాటోగ్రఫీ సీన్లలోని మూడ్‌ను అద్భుతంగా ఆవిష్కరించగా, నీల్ అధికారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాలను మరింతగా పండించింది. యష్ జైదేవ్ ఎడిటింగ్ కథనాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా సుత్తి లేకుండా అందించడంలో తోడ్పడింది.

'ముసాఫిర్ కేఫ్' అనేది కలలు, బాధ్యతలు , ప్రేమ బంధాల మధ్య నడిచే ఒక మానసిక, భావోద్వేగ ప్రయాణం. ప్రారంభంలో కథ కొంత నిమ్మదించినా, ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకుడు పాత్రలతో మమేకమవుతాడు. విక్రాంత్ మాస్సే, వేదిక పింటోల నటన , పక్కా ఎమోషనల్ డ్రామాను కోరుకునే వారికి నెట్‌ఫిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ మంచి ఛాయిస్..

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story