Enola Holmes 3 Review : ఎనోలా హోమ్స్ 3.. మిస్టరీ కంటే ఎమోషన్.!

Enola Holmes 3 Review : ప్రముఖ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ చెల్లెలి సాహసాల కథతో ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందిన 'ఎనోలా హోమ్స్' ఫ్రాంచైజీలో మూడో భాగం

G Krishna
Published on: 30 Jun 2026 6:28 PM IST
Enola Holmes 3
X

Enola Holmes 3 

Enola Holmes 3 Review : ప్రముఖ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ చెల్లెలి సాహసాల కథతో ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందిన 'ఎనోలా హోమ్స్' ఫ్రాంచైజీలో మూడో భాగం (Enola Holmes 3) ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మొదటి రెండు భాగాల తరహాలో ఇది కేవలం 'ఎవరు క్రైమ్ చేశారు?' (Whodunit) అనే సాంప్రదాయ సస్పెన్స్ మిస్టరీ చుట్టూ మాత్రమే తిరగదు. ఈసారి కథలో అసలైన విలన్ ఎవరనే విషయాన్ని మొదటి గంటలోనే రివీల్ చేసినప్పటికీ, సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. నేరం 'ఎవరు చేశారు' అనేదానికంటే, ఆ నేరం వెనుక ఉన్న 'కారణాలు ఏంటి' (Why) అనే అంశంపైనే ఈ మూడో భాగం ఎక్కువ దృష్టి పెట్టింది.

కొత్త డైరెక్టర్.. సరికొత్త మేకింగ్ స్టైల్

గత రెండు భాగాలకు అద్భుతమైన దర్శకత్వం వహించిన హ్యారీ బ్రాడ్‌బీర్ స్థానంలో, ఈసారి నెట్‌ఫ్లిక్స్ హిట్ క్రైమ్ డ్రామా సిరీస్ 'అడోలెసెన్స్' ఫేమ్, ఎమ్మెీ అవార్డు గ్రహీత ఫిలిప్ బారంటిని మెగాఫోన్ పట్టారు. ఒక పాపులర్ ఫ్రాంచైజీని కొత్త డైరెక్టర్ చేతుల్లో పెట్టినప్పుడు వచ్చే అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, బారంటిని తనదైన శైలిలో సినిమాను నడిపించారు. స్క్రీన్‌ప్లే రచయిత జాక్ థోర్న్‌తో కలిసి ఆయన ఎనోలా హోమ్స్ ప్రపంచాన్ని మరింత వైబ్రెంట్‌గా ఆవిష్కరించారు. విక్టోరియన్ కాలం నాటి కథ అయినప్పటికీ.. నేటి కాలానికి కూడా సరిపోయేలా తల్లిదండ్రుల మితిమీరిన నియంత్రణ, భావోద్వేగాలను అణచివేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలను ఇందులో చాలా చక్కగా స్పృశించారు.

గుర్తింపు కోసం ఎనోలా అంతర్మథనం

తన అన్న షెర్లాక్ హోమ్స్ (హెన్రీ కావిల్) అనే ఒక మహా వృక్షం నీడ నుండి ఇప్పుడిప్పుడే సొంత గుర్తింపు తెచ్చుకుంటూ బయటపడిన ఎనోలా (మిల్లీ బాబీ బ్రౌన్), ఈ భాగంలో పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే, పెళ్లి చేసుకుని తన ఇంటి పేరును మార్చుకుంటే, తన సొంత వ్యక్తిత్వం ఎక్కడ కోల్పోతుందో, మళ్లీ భర్త నీడలోనే బతకాల్సి వస్తుందేమోననే ఆందోళన ఆమెను వెంటాడుతుంది. ఒక మహిళగా తన స్వతంత్రతను కాపాడుకోవడానికి ఆమె పడే అంతర్మథనం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

'గ్రీన్ ఫ్లాగ్' లవ్ ట్రాక్.. మనసు దోచే కెమిస్ట్రీ

ఎనోలాకు కాబోయే భాగస్వామిగా టేవ్‌క్స్‌బరీ (లూయిస్ పాట్రిడ్జ్) పాత్ర ఈ సినిమాలో ఒక ప్రధాన ఆకర్షణ. నేటి జనరేషన్ భాషలో చెప్పాలంటే ఆయనొక పక్కా 'గ్రీన్ ఫ్లాగ్' (ఆదర్శవంతమైన వ్యక్తి). తన భాగస్వామి స్వేచ్ఛను, ఆమెకున్న అధికారాలను, సాహసాలను ఎంతగానో గౌరవించే ఒక పర్ఫెక్ట్ ఈక్వల్ పార్ట్‌నర్‌గా ఆయన కనిపిస్తాడు. వారిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్లు, ముఖ్యంగా మిస్సింగ్ కేసు నుండి కాస్త విరామం దొరికినప్పుడు సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్ళిన సీన్ అద్భుతంగా పండింది. బట్టలు విప్పుకుంటూ ఒకరినొకరు చూసి సిగ్గుపడటం, మళ్లీ బట్టలు వేసుకోవడానికి సహాయం చేసుకోవడం వంటి సీన్లలో వ్యక్తమయ్యే అమాయకమైన ప్రేమ , కెమిస్ట్రీ ఇటీవల వచ్చిన సినిమాల్లోనే అత్యంత అందమైన ప్రణయ దృశ్యంగా నిలుస్తుంది.

ఎమోషనే ఎనోలా సూపర్ పవర్!

మొదటి భాగంలో ఎనోలా ఎక్కువగా ఎమోషనల్ అవ్వడంపై షెర్లాక్ హోమ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది అనవసరమని చెప్తాడు. కానీ ఈ భాగంలో, భావోద్వేగాలను దాచుకోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే తన అసలైన సూపర్ పవర్ అని ఎనోలా నిరూపిస్తుంది. కేవలం ఆడవాళ్లే అతిగా ఎమోషనల్ అవుతారనే సమాజపు అపోహను ఆమె గట్టిగా తిప్పికొడుతుంది. కథలో ఒక కీలక సన్నివేశంలో.. ఆగ్రహంతో ఉన్న షెర్లాక్ పగతో ఒక దుష్టుడిని అంతం చేయాలని చూస్తున్నప్పుడు, ఎనోలా అతడిని ఆపుతుంది. "నువ్వు ఎమోషనల్ అవుతున్నావు" అని అన్నకు గుర్తుచేస్తూ, ప్రపంచ చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలన్నీ పురుషుల అతి భావోద్వేగాలు, పగ ప్రతీకారాల వల్లే వచ్చాయని చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్.

సమకాలీన రాజకీయం.. రిచ్ మేకింగ్

కథ పరంగా చూస్తే.. గత భాగాల తరహాలో కేవలం ఒక నిర్దిష్టమైన ఫెమినిస్ట్ ఉద్యమం చుట్టూ కాకుండా, ఈసారి బ్రిటీష్ వారు శతాబ్దాలుగా చేసిన చారిత్రక తప్పిదాలను, పితృస్వామ్య వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ కథా పరిధిని పెద్దది చేశారు. ఎనోలా హోమ్స్ మార్క్ గుర్రపు స్వారీలు, పదునైన పజిల్స్, ముఖాముఖిగా కెమెరాతో మాట్లాడే (Breaking the fourth wall) సీన్లు ఇందులోనూ అలరిస్తాయి. వీటికి తోడు ఈసారి మాల్టా దేశపు అద్భుతమైన , విదేశీ లోకేషన్లు సినిమాకు మరింత గ్రాండ్ లుక్‌ను తీసుకువచ్చాయి. మొత్తానికి పాత వినోదాన్ని పంచుతూనే, అంతకంటే బలమైన ఎమోషనల్ డ్రామాను అందించిన చిత్రంగా 'ఎనోలా హోమ్స్ 3' నిలుస్తుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story