Chinna Chinna Ashai Review : రెండు ఒంటరి మనసుల మధ్య సున్నితమైన ప్రయాణం.!
Chinna Chinna Ashai Review : మధుబాల, ఇంద్రన్స్ ప్రధాన పాత్రల్లో వర్ష వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ భావోద్వేగ చిత్రం 'చిన్న చిన్న ఆశై'. జూన్ 19న
chinna chinna aasai
Chinna Chinna Ashai Review : మధుబాల, ఇంద్రన్స్ ప్రధాన పాత్రల్లో వర్ష వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ భావోద్వేగ చిత్రం 'చిన్న చిన్న ఆశై'. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తాజాగా జులై 28 నుండి ప్రముఖ ఓటీటీ వేదికపై తమిళంతో పాటు మలయాళం, తెలుగు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. మధుబాల కెరీర్‌లో మలుపు తిప్పిన అలనాటి 'రోజా' చిత్రంలోని ప్రసిద్ధ పాట టైటిల్‌తో రూపొందడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
కథాంశం: వారణాసి వీధుల్లో అనుకోని పరిచయం
కాశీ నగరంలో మాధవన్ మాస్టార్ (ఇంద్రన్స్) కుమార్తె జానకి (అపర్ణ బాలమురళి) చదువుకుంటూ సంప్రదాయ నృత్యం నేర్చుకుంటుంది. ఆమెను చూడటానికి కేరళ నుంచి తరచూ వారణాసి వస్తుంటాడు మాధవన్. అలా ఒకసారి వచ్చినప్పుడు, గుంపులో తప్పిపోయి తీవ్ర భయాందోళనతో ఉన్న లీల (మధుబాల) అతనికి కనిపిస్తుంది. తంజావూరు బృందంతో కలిసి వచ్చిన తన ఫోన్, పర్స్ దొంగిలించబడటంతో బృందానికి దూరమయ్యానని లీల చెబుతుంది.
మాధవన్ ఆమెను తప్పిపోయిన వారి సమాచార కేంద్రానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించి, తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆశ్రయం కల్పిస్తాడు. ఈ క్రమంలో లీల తన గతాన్ని వివరించగా, మాధవన్ కూడా భార్యను కోల్పోయి తాను పడుతున్న ఒంటరితనాన్ని పంచుకుంటాడు. లీలకు వారణాసి చూడాలని ఉందని తెలుసుకుని ఆమెను నగరమంతా తిప్పుతాడు. ఈ ఒక్క రోజు ప్రయాణంలో వారిద్దరి మధ్య ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చింది? అనేదే మిగతా కథ.
ఫీల్ గుడ్ ఎమోషన్స్.. కానీ సాగదీత
జీవితంలో సమస్యలు చుట్టుముట్టి విధి ఒంటరిగా నిలబెట్టినప్పుడు మనసు ప్రశాంతతను, ఒక మంచి తోడును కోరుకుంటుంది. అలా కలసిన రెండు స్వచ్ఛమైన మనసుల కథే 'చిన్న చిన్న ఆశై'. వేదాంతం, వైరాగ్యం ఉట్టిపడే వారణాసి నేపథ్యంలో, తమ చిన్న చిన్న ఆశలను నెరవేర్చుకోవాలనుకునే ఇద్దరు వ్యక్తుల చుట్టూ దర్శకుడు కథను చాలా సున్నితంగా అల్లుకున్నారు.
ఒకే ఒక్క రోజులో ఏర్పడే పరిచయం రెండు హృదయాలకు ఎంత ఊరటనిస్తుందో దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే, కథనంలో ఫీల్ తీసుకురావడానికి కేటాయించిన సమయం ఎక్కువ అవ్వడం వల్ల సన్నివేశాలు చాలా నిదానంగా సాగుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. అయినప్పటికీ, ముగింపులో వచ్చే ట్విస్ట్ హృదయాన్ని తాకుతుంది.
నటీనటులు , సాంకేతిక వర్గం
నటుడు ఇంద్రన్స్ తన నటనతో మరోసారి మెప్పించారు. సున్నితమైన భావోద్వేగాలను ఆయన పండించిన తీరు ప్రశంసనీయం. అయితే మధుబాల పాత్ర రూపకల్పనలో కొంత అయోమయం కనిపిస్తుంది.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌లోని ఆంతర్యం ఏమిటనే కన్ఫ్యూజన్ వీక్షకుల్లో మిగిలిపోతుంది. అపర్ణ బాలమురళిపై చిత్రీకరించిన పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గోవింద్ వసంత నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ విభాగాలు కథా మూడ్‌కు తగ్గట్టుగా కుదిరాయి.
జీవితంలో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు లభించే ఒక మధురమైన తోడు, ఆ పరిచయం శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆరాటం చుట్టూ ఈ చిత్రం నడుస్తుంది. నెమ్మదిగా సాగే కథనం ఉన్నప్పటికీ, ప్రశాంతమైన మానసిక అనుభూతిని ఇచ్చే క్లాస్ డ్రామాలను ఇష్టపడే వారికి 'చిన్న చిన్న ఆశై' ఒకసారి చూడదగ్గ చిత్రం..




