Pedda Dornala: పర్యాటక కేంద్రంగా మారుతున్న వెలుగొండ ప్రాజెక్ట్!
Pedda Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్దకు కృష్ణా జలాల రాక.. సందర్శకులతో కళకళలాడుతున్న పర్యాటక ప్రాంతం.
Pedda Dornala: పర్యాటక కేంద్రంగా మారుతున్న వెలుగొండ ప్రాజెక్ట్!
Pedda Dornala: మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల రాకతో నూతన శోభ సంతరించుకుంది. పెద్ద దోర్నాల మండలం కొత్తూరు గ్రామం సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్దకు కృష్ణా జలాలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తున్నారు.
నల్లమల కొండలను తొలిచి నిర్మించిన సొరంగ మార్గాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్ వైపు ప్రవహిస్తున్న దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఫీడర్ కెనాల్ ప్రాంతానికి చేరుకుని కృష్ణా జలాలను వీక్షిస్తున్నారు. కొందరు కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జలహారతులు ఇస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి అందాలకు నెలవైన నల్లమల ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌కు కృష్ణా జలాలు చేరడంతో ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. భవిష్యత్తులో ఫీడర్ కెనాల్ పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు కృష్ణా జలాల రాకతో మూడు దశాబ్దాలుగా ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల కల సాకారమవుతోంది. సాగునీరు, తాగునీరు పుష్కలంగా లభించడంతో గతంలో కరువు పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఈ ప్రాంతం ఇకపై సస్యశ్యామలం కానుందన్న ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
1996లో వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగడం పట్ల పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.




