Markapuram: జిల్లా కేంద్రమైనా మారని తలరాత మార్కాపురంలో ట్రాఫిక్ నరకం!

Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నా, పట్టణంలో ట్రాఫిక్ సమస్య ప్రజలను పట్టిపీడిస్తోంది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 May 2026 11:36 AM IST
Markapuram
X

Markapuram: జిల్లా కేంద్రమైనా మారని తలరాత మార్కాపురంలో ట్రాఫిక్ నరకం!

మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నా పట్టణ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. అధికారులు మారినా, పాలకులు మారినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రమవుతోంది.

ప్రత్యేకించి ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు, పాత బస్టాండ్ ప్రాంతం, గాంధీ బజార్, కోర్టు సెంటర్, కంభం రోడ్, దర్శి రోడ్ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంటోంది. అత్యవసర సేవలకు వెళ్లే అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్, తోపుడు బండ్లు, ఆక్రమణలు, రహదారుల సంకుచిత పరిస్థితి ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. పోలీసులు అప్పుడప్పుడు డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని వ్యాపారులు, వాహనదారులు వాపోతున్నారు.

పట్టణ విస్తరణకు అనుగుణంగా రహదారుల విస్తరణ చేపట్టాలని, ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే ముందుగా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story