Prakasam: ఆలయాల్లో చోరీల ముఠా అరెస్ట్: 13 మంది కటకటాల్లోకి!
Prakasam: ప్రకాశం జిల్లాలో వరుస దేవాలయ చోరీలకు పాల్పడుతున్న 13 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.22.70 లక్షల విగ్రహాలు, వెండి వస్తువులు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Prakasam: ఆలయాల్లో చోరీల ముఠా అరెస్ట్: 13 మంది కటకటాల్లోకి!
ప్రకాశం: దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న 13 మంది ముఠా సభ్యులను మార్కాపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 22.70 లక్షల విలువైన పంచలోహ, ఇత్తడి విగ్రహాలు, వెండి వస్తువులు, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు ఉపయోగించిన ఎర్టిగా కారు, తుఫాన్ వాహనం, రెండు ద్విచక్ర వాహనాలను కూడా పట్టుకున్నారు.
సి.ఎస్.పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని ఆలయాల్లో ఇటీవల జరిగిన వరుస చోరీలపై ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాలతో కనిగిరి డీఎస్పీ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలతో పాటు విశ్వసనీయ సమాచారం సేకరించిన పోలీసులు మంగళవారం పామూరు మండలం రావిగుంటపల్లి శివారులో నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో కొందరు బేల్దారు, స్లాబ్ మిల్లర్ పనులు చేసేవారని, పాత నేరస్తుడైన సోమేపల్లి ఉమామహేశ్వరరావు సూచనతో ఆలయాలను ముందుగా పరిశీలించి చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. కొమరోలు మండలానికి చెందిన బాల గురవయ్య చోరీ సొత్తును స్వీకరించినట్లు పోలీసులు తెలిపారు.
సి.ఎస్.పురం శివాలయం నుంచి చోరీకి గురైన రెండు పంచలోహ విగ్రహాలు, ఇత్తడి అయ్యప్ప విగ్రహం, పామూరు మండలం వగ్గంపల్లి పోలేరమ్మ ఆలయానికి చెందిన ఇత్తడి కిరీటం, రెండు చేతుల కవచాలను స్వాధీనం చేసుకున్నారు. కనిగిరి మండలం చీరలదిన్నె ఆలయంలో చోరీ చేసిన వెండి ఆభరణాలను కరిగించి తయారు చేసిన నాలుగు వెండి గిన్నెలను, కొనకనమిట్ల మండలం గొట్లగట్టు రామాలయం నుంచి చోరీ చేసిన ఇత్తడి హనుమంత వాహనాన్ని విక్రయించగా వచ్చిన నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పెంచాలని ఆయన సూచించారు.




