Markapur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ
Markapur: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
Markapur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ
మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాలలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో దోర్నాల పంచాయతీ కార్యాలయం వేదికగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దోర్నాల మండల పరిధి ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. ప్రజలు అందించిన ప్రతి అర్జీని ఆయన పరిశీలించి, సమస్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత నాయకులు, అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు.
ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులపై ఉందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించడమే ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, అర్జీలను స్వీకరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, దోర్నాల మండల కూటమి నాయకులు పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ షేక్ మాబు జెడి లక్ష్మయ్య, దొడ్డ శేషాద్రి వల్లభనేని కాశయ్య, తదితర గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.




