Peddaraveedu: పెద్దారవీడు రెచ్చిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు
Peddaraveedu: పెద్దారవీడు మండలంలో వరుసగా 20 ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ. రాత్రిపూట పంట పొలాల్లో కాపర్ వైర్లు ఎత్తుకెళ్తున్న దుండగులు. రైతుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు.
Peddaraveedu: పెద్దారవీడు రెచ్చిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు
పెద్దారవీడు: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ పొలాల్లోకి చొరబడి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైండింగ్, రాగి తీగలను ఎత్తుకెళ్తున్నారు. గత కొద్ది రోజుల వ్యవధిలోనే మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 20 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజాగా పెద్దారవీడు గ్రామానికి చెందిన రైతు అల్లు లక్ష్మిగోవిందరెడ్డి పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి, అందులోని కాపర్‌ను దోచుకెళ్లిన దుండగులు, ఖాళీ ట్రాన్స్‌ఫార్మర్ బాడీని సమీప బావిలో పడేసి పరారయ్యారు. ఉదయం పొలానికి వెళ్లిన రైతు ట్రాన్స్‌ఫార్మర్ కనిపించక వెతకగా బావిలో పడేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒకవైపు వర్షాలు లేక పంటల కోసం రైతులు అల్లాడుతుంటే, మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ దొంగల బెడద రైతులను మరింత కుంగదీస్తోంది. బోర్లు పనిచేయక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "వారానికి ఒక ట్రాన్స్‌ఫార్మర్ చోరీ జరుగుతున్నా... దొంగలు మాత్రం దొరకడం లేదు..?" అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠాను అరెస్ట్ చేయాలని, రైతులు కోరుతున్నారు .




