Pedda Dornala: గిరిజన విద్యార్థులు జాతీయ పరీక్షల్లో రాణించాలి ఎంఎం నాయక్

Pedda Dornala: గిరిజన విద్యార్థులను IIT, NEET పరీక్షలకు సిద్ధం చేయాలని విద్యాసంస్థల ఆకస్మిక తనిఖీల్లో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం. నాయక్ ఆదేశం.

Srikanth Singam, Markapur
Published on: 4 July 2026 6:17 PM IST
Pedda Dornala
X

Pedda Dornala: గిరిజన విద్యార్థులు జాతీయ పరీక్షల్లో రాణించాలి ఎంఎం నాయక్

పెద్ద దోర్నాల: పెద్ద దోర్నాలగిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం. నాయక్ సూచించారు. పెద్దదోర్నాల మండలంలోని విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మొదటగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ (EMRS)ను సందర్శించిన ఆయన, పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల వినియోగంపై ఆరా తీసి, వాటిని విద్యాభ్యాసానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే IIT, JEE, NEET వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.

అనంతరం సిబ్బందితో సమావేశమైన ఆయన, గిరిజన విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలోనే విద్యార్థులు IIT, JEE, NEET పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. తదుపరి చింతల చెంచుగూడెంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలపై తల్లిదండ్రులకు విశ్వాసం పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల చేరికలు పెరిగేలా కార్యాచరణ రూపొందించడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అలాగే నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (SOE) పాఠశాలను సందర్శించారు. అక్కడ MPC, Bi.PC విద్యార్థులకు అందిస్తున్న ఆన్‌లైన్ కోచింగ్ తరగతులను పరిశీలించి, IIT, JEE, NEET శిక్షణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తూ, పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి పోలిశెట్టి వెంకటనాయుడు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story