Santaravuru: సంతరావూరులో రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ!

Santaravuru: సంతరావూరు రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ 1.05 కోట్ల సీజీఎఫ్ నిధులు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 4 Sept 2026 3:51 PM IST
Santaravuru
X

Santaravuru: సంతరావూరులో రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ!

Santaravuru: ఆధ్యాత్మికతతోనే సమాజంలో శాంతి, ఐక్యత సిద్ధిస్తాయని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం సంతరావూరులోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శుక్రవారం వైభవంగా భూమిపూజ నిర్వహించారు. పవిత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ భూమిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పునర్నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తికావాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమానికి హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదని, ప్రజల ఆధ్యాత్మిక చైతన్యానికి, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. తరతరాలుగా గ్రామ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం ఆనందదాయకమన్నారు. దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణకు ప్రభుత్వం, దాతల సహకారంతో అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీజీఎఫ్‌ నిధుల నుంచి రూ.1.05 కోట్లు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం నాణ్యతతో, వైభవంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఆలయ పునర్నిర్మాణంతో సంతరావూరు గ్రామానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరుతుందని, భవిష్యత్తులో ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో ఈ పవిత్ర కార్యం విజయవంతంగా పూర్తవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story