Markapuram: వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో ఇద్దరు యువకులు గల్లంతు

Markapuram: మార్కాపురం జిల్లా కటకానిపల్లె వద్ద వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. త్వరలో పెళ్లి జరగాల్సిన యువకుడు ఉండటంతో తీవ్ర విషాదం.

Srikanth Singam, Markapur
Published on: 5 Sept 2026 6:51 PM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో ఇద్దరు యువకులు గల్లంతు

మార్కాపురం: వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతైన విషాద ఘటన పెద్దదోర్నాల మండలం కటకానిపల్లె సమీపంలో చోటుచేసుకుంది. గత నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌ను చూసేందుకు వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు.

కటకానిపల్లె ఎస్సీ పాలెంకు చెందిన పుప్పాల రాజ్‌కుమార్ (22), అతని చిన్నాయన కుమారుడు పుప్పాల వినయ్‌కుమార్ (23) గల్లంతైన వారిగా గుర్తించారు. వీరితో పాటు మొత్తం ఎనిమిది మంది ఫీడర్ కెనాల్‌ను చూసేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు నీటిలోకి దిగగా, ప్రమాదాన్ని గుర్తించిన మరో యువకుడు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది.

గల్లంతైన రాజ్‌కుమార్‌కు ఇప్పటికే వివాహం నిశ్చయమైంది. కంభం మండలం మాగుటూరుకు చెందిన యువతితో ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. దీంతో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రాజ్‌కుమార్ తల్లిదండ్రులు పెద్ద ఆవులయ్య, జానీలకు అతడే ఏకైక కుమారుడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫీడర్ కెనాల్‌లో నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. యువకుల ఆచూకీ కోసం అధికారులు, స్థానికులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలానికి స్థానిక తాసిల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, సీఐ అజయ్ కుమార్ చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story