Markapuram: మార్కాపురం జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం
Markapuram: మార్కాపురం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.
Markapuram: మార్కాపురం జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం
మార్కాపురం: మార్కాపురం (SIR)–2026లో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల సవరణలకు సంబంధించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత తెలిపారు.
ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా, ఏఎస్‌డీడీ జాబితాలను పరిశీలించుకోవచ్చన్నారు.
ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు, ముఖ్యంగా 18–19 ఏళ్ల యువ ఓటర్లు ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం–6, ఓటర్ల జాబితాలో లేని, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపునకు ఫారం–7, పేరు, చిరునామా, ఫొటో, వయస్సు తదితర వివరాల సవరణతో పాటు ఇతర ప్రాంతానికి మారేందుకు ఫారం–8 సమర్పించవచ్చని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు దరఖాస్తుదారులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించి దరఖాస్తులను స్వీకరించి తదుపరి పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్‌ఓలతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఓటర్ల జాబితాలోని వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ ఎం. విజయ సునీత కోరారు.




