Markapuram: ఊసరవెల్లి రాజకీయాలు మానుకో.. ఎమ్మెల్యే కందుల ఫైర్!
Markapuram: ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడి సృష్టించొద్దంటూ వైసిపి ఇన్‌చార్జ్ పై ఎమ్మెల్యే కందుల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Markapuram: ఊసరవెల్లి రాజకీయాలు మానుకో.. ఎమ్మెల్యే కందుల ఫైర్!
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్‌నగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
మార్కాపురం జిల్లా ప్రశాంతంగా ఉందని, అయితే ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు వలస వచ్చిన వైసీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు.
మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేది కూడా తమ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
భ్రమరా టౌన్‌షిప్ వెంచర్స్ అంశంపై మాట్లాడుతూ, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే అంశంపై విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మార్కాపురం అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అలాగే శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం భూములు, ఏబీఎం ఆస్తులను ఆక్రమించింది వైసీపీ నాయకులేనని ఎమ్మెల్యే ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ నాయకుల ఆధీనంలో ఉన్న ఆస్తులను తిరిగి దేవస్థానానికి అప్పగించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.




