Markapur: వెలిగొండ కాలువలో గల్లంతైన యువకుడి కోసం గాలింపు

Markapur: మార్కాపురం జిల్లాలో వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో గల్లంతైన యువకుడు రాజ్‌కుమార్ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు డ్రోన్లతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

Srikanth Singam, Markapur
Published on: 9 Sept 2026 5:42 PM IST
Markapur
X

Markapur: వెలిగొండ కాలువలో గల్లంతైన యువకుడి కోసం గాలింపు

మార్కాపూర్: మార్కాపురం జిల్లా వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో గల్లంతైన దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రాజ్‌కుమార్ (23) ఆచూకీ కోసం మార్కాపురం పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఈ నెల 5వ తేదీన వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద నీటిని చూసేందుకు వెళ్లిన పుప్పాల రాజ్‌కుమార్, పుప్పాల వినయ్‌కుమార్ (23) ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.

మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫిషరీస్ శాఖకు చెందిన గజ ఈతగాళ్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

వెలిగొండ ఫీడర్ కెనాల్‌తో పాటు నల్లమల్లసాగర్‌లో విస్తృతంగా గాలింపు చేపట్టగా, పుప్పాల వినయ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

మరో వ్యక్తి పుప్పాల రాజ్‌కుమార్ ఆచూకీ కోసం ప్రస్తుతం 15 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నాలుగు డ్రోన్ల సహాయంతో నల్లమల్లసాగర్ పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. అదనంగా మరో 15 మంది సభ్యులతో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం బుధవారం అక్కడికి చేరుకుని గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొననుంది.

నల్లమల్లసాగర్‌లోకి ఇటీవల కొత్తగా నీరు చేరడంతో గతంలో చెట్లు, ముళ్లకంచెలు, దట్టమైన పొదలు ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు క్లిష్టంగా మారుతున్నప్పటికీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

రాజ్‌కుమార్ ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను నిరంతరాయంగా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

నీటి ప్రాంతాలకు వెళ్లొద్దు

కాలువ, సాగర్ పరిసర ప్రాంతాలకు ప్రజలు అనవసరంగా వెళ్లవద్దని పోలీసులు సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిలోకి దిగడం, సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పిల్లలు, యువత నీటి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్త వహించాలిఅని పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story