Ongole: బ్యాంక్‌లో ‘గోల్డ్’ గోల్‌మాల్.. తాకట్టు పెట్టిన బంగారం మాయం!

Ongole: ఒంగోలు యాక్సిస్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ కుంభకోణం. తాకట్టు పెట్టిన బంగారం ప్రైవేట్ ఫైనాన్స్‌లకు మళ్లింపు.

SHOWRY, ONGOLE
Published on: 6 May 2026 7:15 PM IST
Ongole
X

Ongole: బ్యాంక్‌లో ‘గోల్డ్’ గోల్‌మాల్.. తాకట్టు పెట్టిన బంగారం మాయం!

Ongole: ఒంగోలు పట్టణంలోని Axis Bank మైయిన్ బ్రాంచ్‌లో గోల్డ్ లోన్ వ్యవహారంలో భారీ గోల్‌మాల్ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంక్ సిబ్బంది బయట ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో మళ్లీ తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఒంగోలు కు చెందిన రామచంద్ర బాలసుబ్రహ్మణ్యణ్ అనే వ్యక్తి 2023 సంవత్సరంలో సుమారు 67 గ్రాముల బంగారాన్ని యాక్సిస్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టాడు. ఇటీవల తన బంగారాన్ని విడిపించుకునేందుకు బ్యాంక్‌ను సంప్రదించగా, సిబ్బంది నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశాడు. నాలుగు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతూ వివరాలు అడిగినా, ప్రతి సారి వేరువేరు కారణాలు చెబుతూ కాలయాపన చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.

దీనిపై గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. బ్యాంక్‌లో ఉండాల్సిన బంగారం అక్కడ లేనట్లు సిబ్బంది ఒప్పుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. ఈ క్రమంలో నాగరాజు అనే వ్యక్తి పేరుతో బ్యాంక్‌లోని బంగారం తీసి, అదే బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటన బయటకు రావడంతో యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ బంగారం నిజంగా బ్యాంక్‌లో సురక్షితంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో మరెంత మంది ఖాతాదారుల బంగారం బయట ఫైనాన్స్ కంపెనీలకు మళ్లించబడిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఇక ఈ వ్యవహారంలో కీలకంగా వినిపిస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఎవరు? అతనికి బ్యాంక్‌తో సంబంధం ఏమిటి? సిబ్బందితో కలిసి ఈ వ్యవహారాన్ని నడిపించాడా? లేక మధ్యవర్తిగా వ్యవహరించాడా? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై బ్యాంక్ ఉన్నతాధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే అంతర్గత విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఖాతాదారుడి తో రాజీ ప్రయత్నాలు చేస్తున్న స్తానిక బ్యాంకు మేనేజర్.

అసలు ఇంతకీ ఒంగోలు యాక్సిస్ బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారం ఎంత వరకు సేఫ్ గా ఉంది…? బ్యాంక్ నుంచి ఎంత బంగారం బయట ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టారు…?

SHOWRY, ONGOLE

SHOWRY, ONGOLE

Next Story