Dornala: జేసీబీ అనుమతులు కోరుతూ సీఎం చంద్రబాబుకు చెంచు రైతుల లేఖలు
Dornala: దోర్నాల మండలం చెంచు గిరిజన రైతులు తమ ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో జేసీబీ అనుమతి కోరుతూ సీఎం చంద్రబాబుకు పోస్టుకార్డుల ద్వారా ఉత్తరాలు రాశారు.
Dornala: జేసీబీ అనుమతులు కోరుతూ సీఎం చంద్రబాబుకు చెంచు రైతుల లేఖలు
దోర్నాల: చెంచు గిరిజన రైతుల ఆర్‌ఓఎఫ్‌ఆర్ అటవీ భూముల్లో సాగు చేసుకునేందుకు అవసరమైన జేసీబీ అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ చింతల, తుమ్మలబైలు గ్రామాలకు చెందిన సుమారు వంద మంది చెంచు గిరిజన రైతులు మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పోస్టుకార్డుల ద్వారా ఉత్తరాలు రాశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్నప్పటికీ, భూముల్లో ఉన్న ముళ్ల చెట్లు, పొదలను తొలగించి సాగుకు అనుకూలంగా చేసుకునేందుకు అటవీశాఖ అధికారుల నుంచి జేసీబీ అనుమతి అవసరమవుతోందన్నారు. అనుమతి కోసం పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
గత నెల 14వ తేదీన మార్కాపురం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎఫ్‌ఓలకు సైతం వినతిపత్రాలు అందజేశామని పేర్కొన్నారు. అయినప్పటికీ గత రెండు నెలలుగా అటవీశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ భూములను సాగుకు సిద్ధం చేసుకునేందుకు జేసీబీ అనుమతులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే పోస్టుకార్డుల ద్వారా ఉత్తరాలు రాశామని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించి ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో సాగు చేసుకునేందుకు జేసీబీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
సమస్య పరిష్కారం కాకుంటే ఈ నెల 22వ తేదీన చింతలలో రాస్తారోకో నిర్వహిస్తామని చింతల, తుమ్మలబైలు గ్రామాలకు చెందిన చెంచు గిరిజన రైతులు హెచ్చరించారు.




