Dornala: దోర్నాల పంటల రక్షణపై రైతులకు అవగాహన
Dornala: దోర్నాలలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం. ప్రత్తిలో పురుగుల నివారణ, పంటల బీమా, ఎరువుల పంపిణీపై రైతులకు దిశానిర్దేశం చేసిన వ్యవసాయాధికారులు.
Dornala: దోర్నాల పంటల రక్షణపై రైతులకు అవగాహన
దోర్నాల: మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని యడవల్లి, అయినముక్కల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. జవహర్ లాల్ నాయక్ పాల్గొని గ్రామాల్లో సాగు చేసిన PMDS (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలను పరిశీలించారు.
అనంతరం ప్రత్తి పంటను సందర్శించిన ఆయన, పంటలో రసం పీల్చే పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ ఉధృతి ఉన్నట్లు గుర్తించారు. వీటి నివారణకు ఆసిఫేట్ 75% SP 1 గ్రాము/లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.4 మి.లీ/లీటర్, అసెటామిప్రిడ్ 20 SP 0.2 గ్రాములు/లీటర్, థయామెథాక్సామ్ 25 WG 0.2 గ్రాములు/లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.
ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, చిరుధాన్య పంటలను ప్రోత్సహించాలని కోరారు.
వాతావరణ భీమా పథకం కింద ప్రత్తి సాగు చేసిన రైతులు ఈ నెల 31వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పంటల బీమా పథకం (PMFBY) కింద వరి, కంది, సజ్జ, మినుములు, నువ్వులు, ఎండు మిరప సాగు చేసే రైతులు కూడా పంటల బీమా కోసం నమోదు చేసుకోవచ్చన్నారు.
APAIMS 2.0 యాప్ ద్వారా రైతులకు యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌ఏ కృష్ణవేణి, వీఏఏ శివశైలజ, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది ఆనందరావు, రాములమ్మ, అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు.




