Markapuram: పెద్దదోర్నాలలో పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష
Markapuram: పెద్దదోర్నాలలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ సిబ్బందితో డెంగ్యూ, మలేరియా నియంత్రణ మరియు సదరం సర్టిఫికెట్లపై కీలక సమీక్ష నిర్వహించారు.
Markapuram: పెద్దదోర్నాలలో పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష
మార్కాపురం: మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల: పెద్ద దోర్నాల వెలుగు కార్యాలయంలో మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, డీఎల్‌ఏటీఓ డాక్టర్ కే. రాహుల్ ఆధ్వర్యంలో చింతల, కొర్రప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున తరచూ గూడేలను సందర్శించి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
క్షయవ్యాధి బాధితులను ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించి వెంటనే చికిత్స అందించాలని సూచించారు. అలాగే కుష్ఠు అనుమానితులను క్షేత్రస్థాయిలో గుర్తించి సకాలంలో మందులు అందిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ ఎం. యాగ్నిక్ మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, ఎల్‌టిలు, ఫార్మసిస్టులు ప్రతిరోజూ ఐడీఎస్‌పీ (IDSP) వివరాలను మధ్యాహ్నంలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
వికలాంగుల పెన్షన్‌కు అర్హులైన వారిని గుర్తించి సదరం స్లాట్ బుక్ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. సదరం సర్టిఫికెట్ వచ్చిన అనంతరం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలోని మెడికల్ బోర్డు ద్వారా ధ్రువీకరణ పొందాలని చెప్పారు. 85 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు, అలాగే పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైనవారు మాత్రమే అర్హులని వివరించారు. అర్హత ఉన్న వారు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను సంప్రదించాలని సూచించారు. సమీక్షా సమావేశం అనంతరం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చింతల, కొర్రప్రోలు వైద్యాధికారులు డాక్టర్ టి. లక్ష్మీనారాయణ, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ భవ్యశ్రీ, సీహెచ్‌వోలు హబీబ్ ఖాన్, గౌస్ మొహిద్దీన్, పీహెచ్‌ఎన్ సూర్యకుమారి, సూపర్‌వైజర్లు పద్మావతి, ఎస్‌కే మస్తాన్ బీ, ఎం. రాఘవేంద్రరావు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ఎల్‌టిలు, ఫార్మసిస్టులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




