Pedda Dornala: సీఎం చంద్రబాబు పర్యటన.. గంటావానిపల్లిలో భద్రతా సమీక్ష!
Pedda Dornala: ఈ నెల 27న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గంటావానిపల్లిలో భద్రతా ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు.
Pedda Dornala: సీఎం చంద్రబాబు పర్యటన.. గంటావానిపల్లిలో భద్రతా సమీక్ష!
పెద్ద దోర్నాల: ఈ నెల 27న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో గంటావానిపల్లిలో భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.
మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎస్ఎస్జీ డీఎస్పీ చంద్రశేఖర్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ జి. ఎరిక్షన్ బాబు తదితరులు కార్యక్రమ స్థలాలను పరిశీలించారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే సీఎం కాన్వాయ్ రూట్‌ను పరిశీలించి, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, బందోబస్తు నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, హెలిప్యాడ్, ప్రజావేదిక, నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగే ప్రాంతాలు, ఫీడర్ కాలువ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అతిథుల వాహనాల కోసం వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, దర్శి డీఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాసరావు, వైపాలెం సీఐ కె. అజయ్ కుమార్, సీఐలు అస్సన్, రామారావు, సుబ్బరాజు, మల్లికార్జునరావు, ఆర్ఐ రమణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.




