Markapuram: 30 ఏళ్ల కల సాకారం.. ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం!
Markapuram: కరువు ప్రాంతాల ప్రజల 30 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Markapuram: 30 ఏళ్ల కల సాకారం.. ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం!
మార్కాపురం: కరువు పీడిత మార్కాపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చనున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 30 ఏళ్ల కల ఈనెల 31న సాకారం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తూ జలాలను విడుదల చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది.
మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు,అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణతో పాటు పునరావాస, పరిహార సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి పరిశీలనలు, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ విజయ సునీత నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు.
నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేస్తూ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ పనుల్లో వేగం పెంచుతున్నారు. ఎందరో మహనీయుల కల, లక్షలాది మంది ప్రజల ఆకాంక్ష అయిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా మలిచేందుకు జిల్లా యంత్రాంగం పగలు, రాత్రి తేడా లేకుండా కృషి చేస్తోంది.




