Nirmal: ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Nirmal: ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 6 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, జూపల్లి వెల్లడించారు.
Nirmal: ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నిర్మల్: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వన మహోత్సవం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, వ్యవసాయ రంగం, నీటి వినియోగం తదితర అంశాలపై రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 6 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయంగా వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని, ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పంట మార్పిడి విధానాల అమలు ద్వారా రైతులు నష్టాలను నివారించడంతో పాటు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు ప్రణాళికలపై స్పష్టమైన సమాచారం అందించేందుకు గ్రామ స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు విస్తృతంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లాల వారీగా వర్షపాతం, పంటల సాగు, నీటి లభ్యత తదితర అంశాలను సమీక్షించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, సమావేశం అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వన మహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించి, రైతులకు నీటి వినియోగం, పంటల ఎంపికపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్ఓ రాథోడ్ రమేష్, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీఈఓ భోజన్న, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




