Kamareddy: మంజీరా నదిలో ఇసుక మాఫియా గుట్టురట్టు.. ఇసుక టిప్పర్ల సీజ్!
Kamareddy: బిచ్కుంద మండలం గుండె నేమ్లి మంజీరా నది నుండి రాత్రి వేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు
Kamareddy: మంజీరా నదిలో ఇసుక మాఫియా గుట్టురట్టు.. ఇసుక టిప్పర్ల సీజ్!
కామారెడ్డి: ప్రభుత్వ నిబంధనకు తూట్లు పొడుస్తూ రాత్రి సమయంలో పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తున్న టిప్పర్లను ప్రజలు అడ్డుకొని పోలీసులకు అప్పగించిన వైనం బిచ్కుంద మండలం గుండె నేమ్లి లో నెలకొంది.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె నేమ్లి మంజీరానదీ నుండి నిన్న (బుధవారం) రాత్రి ఇతర ప్రాంతానికి తరలిస్తున్న 3 టిప్పర్లను బండ రెంజల్ చెక్ పోస్ట్ వద్ద గ్రామస్థులు, చెక్ పోస్ట్ సిబ్బంది అడ్డుకొని వే బిల్లులు అడగడంతో టిప్పర్ డ్రైవర్లు వాగ్వివాదానికి దిగడంతో అపమత్తమైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు బిచ్కుంద ఎస్సై గుండెల రాజు, పోలీస్ సిబ్బంది తో బండ రెంజల్ చెక్ పోస్ట్ వద్దకు చేరుకొని 3 టిప్పర్లను పట్టుకొని బిచ్కుంద పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లను నిర్మించుకునేందుకు గాను మన ఇసుక మన వాహన పథకం కింద ఆన్లైన్ లో అప్లై చేసుకున్న టోకెన్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని అలాంటిది ఏమి లేకుండ గత వారం రోజుల నుండి రాత్రి పూట గుండె నేమ్లి మంజీరానదీ నుండి గుట్టు చప్పుడు కాకుండా ఇసుక తరలిస్తున్న ఇసుక మాఫియా పై అధికార యంత్రాంగం ఎం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు నిర్మించుకునే వారుఇసుకను ట్రాక్టర్ల ద్వార తెచ్చుకుంటే తనిఖీ చేస్తున్న అధికారులు ఏకంగా టిప్పర్ల ద్వార రాత్రి సమయంలో కొల్లగొట్టుకొని వెళ్తుంటే ఎందుకు పట్టుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.రెవెన్యూ, మైనింగ్ శాఖ, పోలీస్ శాఖ పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా బకాసురులు గ్రామంలోని కొందర్ని మచ్చిక చేసుకుని ఇసుక ను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇసుక తరలింపు కు మూలకారణమైన నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని గత కొంత కాలంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి విఘాతం కలిగేల తూట్లు పొడుస్తున్న ఇసుక బకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని లేనిపక్షంలో మంజీరానదీ లోని ఇసుక నంత తరలించుకుపోయి భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిన్న రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చేరుకొని టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి సమయంలో ఇసుకను తరలిస్తున్న వ్యక్తులపై రెవెన్యూ, మైనింగ్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఈ విషయం పై ఎస్సై కి వివరణ కోరగా పట్టుబడ్డ 3 ఇసుక టిప్పర్లకు సంబంధించిన వే బిల్లులు ఉన్నాయని రాత్రి సమయంలో తరలించడం ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించడమే నాని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు స్పష్టం చేశారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వడం లేదా తరలించడం చట్టవిరుద్ధమని ఎవరైనా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ ఘటనకుసంబంధించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్సై గుండెల రాజు తెలిపారు.




