Banswada: జూనియర్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పరిశీలించిన కలెక్టర్

Banswada: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు.

SALEEM, BANSWADA
Published on: 12 Aug 2026 7:57 PM IST
Banswada
X

Banswada: జూనియర్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పరిశీలించిన కలెక్టర్

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం కళాశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లను పరిశీలించి, విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్కులను అందించారు. అలాగే విద్యార్థులకు అందుతున్న డిజిటల్ బోధనా విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తదుపరి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న అధ్యాపకులను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అధ్యాపకులు నూతన బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే విధంగా బోధన సాగించాలని దిశానిర్దేశం చేశారు. అధ్యాపకుల నిరంతర అభ్యాసం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సాయి వర్షిణి, నిదా తహిరీన్‌లను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ఈ విద్యార్థులను రాష్ట్ర స్థాయి ర్యాంకర్లుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేసిన కళాశాల అధ్యాపకులను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో RDO రవీందర్ రెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల బాన్సువాడ ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్, లింగంపేట్ ప్రిన్సిపల్ నరేందర్, బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ యాద గౌడ్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story