Kamareddy: బోర్లం గురుకుల కళాశాలలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ!
Kamareddy: బాన్సువాడ మండలం బోర్లం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kamareddy: బోర్లం గురుకుల కళాశాలలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ!
కామారెడ్డి: బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, జూనియర్ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతులు, భోజనం, పరిశుభ్రత తదితర అంశాలను వారు పరిశీలించారు.
విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీ
గురుకుల తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినులతో ఒకే చోట కూర్చొని భోజనం చేస్తూ, వారికి అందిస్తున్న ఆహారం నాణ్యత, రుచి, మెనూ అమలు, పరిశుభ్రతపై స్వయంగా తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
విద్యార్థినులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందేలా చూడాలని, భోజన తయారీ ప్రదేశం, వంట సామగ్రి, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
తరగతి గదులు, రికార్డుల పరిశీలన
కళాశాలలోని తరగతి గదులను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి చదువులు, విద్యా ప్రగతి, కళాశాలలో అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో బోధనా విధానం, బ్లాక్‌బోర్డుపై రాసిన పాఠాలు, విద్యార్థుల విద్యా ప్రగతి, కళాశాల రికార్డులు, నివేదికలు, విద్యార్థులు సాధించిన ట్రోఫీలను పరిశీలించారు.
అధ్యాపకులతో విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా పద్ధతులు, పరీక్షల ఫలితాలపై చర్చించారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి, ఉన్నత విద్యకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
కళాశాల ఆవరణ, విద్యార్థినుల వసతి సౌకర్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం, మెరుగైన వసతులు అందించడం అధికారుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీసీఓ, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, గిర్దావర్, జీపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారూ.




