Armoor: ఆర్మూర్‌లో చీతా ఫోర్స్ మెరుపు దాడులు అక్రమ ఇసుక లారీల సీజ్!

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, మోర్తాడ్ ప్రాంతాల్లో చీతా ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రెండు 14 టైర్ల ఇసుక లారీలను సీజ్ చేశారు.

VENU, BALKONDA
Published on: 12 May 2026 5:13 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్‌లో చీతా ఫోర్స్ మెరుపు దాడులు అక్రమ ఇసుక లారీల సీజ్!

Armoor: నేడు మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధి మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీత ఫోర్స్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. రహస్య సమాచారం మేరకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇసుక లారీలను గుర్తించిన పోలీసులు వెంటనే వాటిని అడ్డుకుని తనిఖీ చేశారు.

తనిఖీల్లో రెండు 14 టైర్ల భారీ వాహనాల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, రవాణా పత్రాలు లేదా మైనింగ్ సంబంధిత డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకుని, డ్రైవర్లు మరియు సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేశారు.

పట్టుబడిన లారీలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత మోర్తాడ్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు అప్పగించారు. కేసు నమోదు చేసి , ఇసుక ఎక్కడి నుండి తరలిస్తున్నారు , దీనికి సంబంధించి మరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా , నదీ పరివాహక ప్రాంతాలు దెబ్బతిని పర్యావరణ సమతుల్యతకు ముప్పు ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరగడం వల్ల భూగర్భ జలాల స్థాయి తగ్గిపోవడం , వ్యవసాయ భూములపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ మైనింగ్ మరియు ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక బృందాలతో చెక్‌పోస్టులు , ప్రధాన రహదారులు మరియు గ్రామీణ మార్గాల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.

ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story