Bichkunda: ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌కు తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌కు వారం రోజులుగా తాళం పడటంతో విద్యార్థులు డిస్టెన్స్ సర్టిఫికెట్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Bichkunda: ఆర్‌అండ్‌బీ ఆఫీస్‌కు తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు!
బిచ్కుంద (కామారెడ్డి ): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజులుగా కందర్పల్లి గ్రామంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన డిస్టెన్స్ సర్టిఫికెట్ల కోసం బిచ్కుంద నుంచి సుమారు మూడు కిలోమీటర్లు నడిచి కార్యాలయానికి వస్తున్నా.. తాళం దర్శనమివ్వడంతో నిరాశగా వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
మూడు నెలల క్రితం బిచ్కుందలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని కందర్పల్లికి తరలించారు. అక్కడ ప్రత్యేక కార్యాలయ భవనం అందుబాటులో లేకపోవడంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే కార్యాలయానికి వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కరపత్రం ఉంది.. సంప్రదించాల్సిన అధికారి ఫోన్ నంబర్ లేదు!
డిస్టెన్స్ సర్టిఫికెట్ కోసం అవసరమైన ధ్రువపత్రాల వివరాలతో కార్యాలయం ముందు కరపత్రం ఏర్పాటు చేసిన అధికారులు.. అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలి, వారి ఫోన్ నంబర్ ఏమిటనే కనీస సమాచారాన్ని మాత్రం పొందుపరచకపోవడం విడ్డూరంగా ఉందని విద్యార్థులు మండిపడుతున్నారు.
కొంతమంది విద్యార్థులు డీఈ వినోద్‌ను సంప్రదించగా.. తాను కేవలం అదనపు ఇన్‌చార్జిగా ఉన్నానని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
అధికారులకు విధుల కంటే ‘ఇతర’ పనులే ముఖ్యమా?
కార్యాలయ విధుల కోసం అధికారులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి ఫోన్లు వస్తే మాత్రం అధికారులు అందుబాటులోకి వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
డిస్టెన్స్ సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.
జిల్లా అధికారులు స్పందించాలి!
ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. వారం రోజులుగా కార్యాలయానికి తాళం వేసి ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి బాధ్యులైన ఆర్‌అండ్‌బీ ఏఈ, డీఈల పనితీరుపై జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిర్లక్ష్యం నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




