Armoor: ఆర్మూర్‌లో 'హెచ్ఎంటీవీ' వార్తకు స్పందన: రోడ్లపై ఆక్రమణలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు!
Armoor: ఆర్మూర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు రోడ్లపై దుకాణదారులు సామాగ్రిని ఉంచి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్నారన్న వార్తపై పోలీసులు స్పందించారు.
Armoor: ఆర్మూర్‌లో 'హెచ్ఎంటీవీ' వార్తకు స్పందన: రోడ్లపై ఆక్రమణలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు!
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కమలా నెహ్రూ వీధిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యపై 'హెచ్ఎంటీవీ' (HMTV) ప్రసారం చేసిన వార్తకు అధికారులు తక్షణమే స్పందించారు. ఎమ్మార్వో కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపై దుకాణదారులు తమ సామాగ్రిని ఇష్టానుసారంగా ఉంచడంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఛానల్ వెలుగులోకి తెచ్చింది.
ఎమ్మార్వో ఆఫీస్ ముందున్న రోడ్డుపై ఇటువైపు, అటువైపు ఉన్న దుకాణదారులు తమ వ్యాపార సామాగ్రిని రోడ్డుపైనే పెట్టడంతో దారి ఇరుకుగా మారిపోయింది. ఈ మార్గంలో టూ వీలర్లతో పాటు భారీ లారీలు, టారస్ వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. సామాగ్రి ఆక్రమణ వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనం అవస్థలు పడుతున్న విషయాన్ని స్థానికులు హెచ్ఎంటీవీ రిపోర్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రత్యేక వార్తా కథనం రావడంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు.
వార్త ప్రసారమైన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, రోడ్డుపై ఉన్న దుకాణదారుల సామాగ్రిని యజమానుల చేతనే తక్షణమే తొలగింపజేశారు. రోడ్డును క్లియర్ చేసి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు హెచ్ఎంటీవీ ద్వారా పట్టణ ప్రజలకు, వ్యాపారులకు కీలక విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఎక్కడైనా రోడ్లపై ఫ్లెక్సీ బోర్డులు, పండ్ల బండ్లు, దుకాణాల సామాగ్రిని ఉంచి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారాలు చేసుకునే వారు తమ పరిమితుల్లోనే ఉండాలని, ప్రజల సౌకర్యార్థం పోలీసులకు సహకరించాలని కోరారు.
తమ సమస్యపై స్పందించి వార్త రాసిన హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మరియు తక్షణమే స్పందించిన పోలీసులకు ఆర్మూర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.




