Vinjamuru: వింజమూరు తాగునీటి పనులపై గ్రామస్తుల ఆగ్రహం!
Vinjamuru: నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లారెడ్డిపల్లిలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు. 6 బోర్లు తవ్వకం, పైప్‌లైన్ పనులపై విచారణకు డిమాండ్.
Vinjamuru: వింజమూరు తాగునీటి పనులపై గ్రామస్తుల ఆగ్రహం!
Vinjamuru: నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి పంచాయతీ పరిధిలోని నల్లారెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ నిధులతో చేపట్టిన తాగునీటి పనులు వివాదానికి దారితీశాయి. కేవలం 26 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్న గ్రామంలో ఏకంగా ఆరు బోర్లు తవ్వించడంపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.గ్రామస్తుల కథనం ప్రకారం, జియాలజిస్ట్ సమక్షంలో తవ్విన ఆరు బోర్లలో నాలుగు బోర్లు విఫలమయ్యాయని, రెండు బోర్లలో మాత్రమే స్వల్పంగా నీరు లభించిందని చెబుతున్నారు.
ఇప్పటికే గ్రామంలో తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండగా, మళ్లీ భారీ వ్యయంతో కొత్త బోర్లు తవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.అంతేకాకుండా అవసరం లేని ప్రాంతాల్లో పైప్‌లైన్లు వేసి, ఇంటి కనెక్షన్లు ఇవ్వకుండానే వాటిని మట్టితో పూడ్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన కొన్ని బోర్లను వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పనులపై పూర్తి స్థాయి సాంకేతిక, ఆర్థిక విచారణ నిర్వహించి, నిధుల వినియోగంలో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఈ అంశంపై RWS ఏఈ వరప్రసాద్ స్పందిస్తూ, కొంతమంది గ్రామస్తుల అభ్యర్థన మేరకే తాగునీటి పనులు చేపట్టాం అని వివరణ ఇచ్చారు.
అయితే గ్రామస్తుల ఆరోపణలు, అధికారుల వివరణ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.




