Vinjamur: వింజమూరులో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Vinjamur: ఉదయగిరి నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. నర్రవాడ ఆలయానికి రూ.6 కోట్లు మంజూరు.
Vinjamur: వింజమూరులో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
వింజమూరు: ఉదయగిరి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా మార్కాపురం వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో వింజమూరుకు చేరుకుని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను కలిశారు. వింజమూరులోని ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో మంత్రి ఆనం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధి,నిధుల మంజూరు,భక్తులకు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే,టీడీపీ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.అనంతరం వింజమూరు బంగ్లా సెంటర్ చెరువుకట్ట వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్మాణం,అభివృద్ధి కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అలాగే ఉదయగిరి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న రంగనాయకుల స్వామి దేవస్థానాన్ని దేవాదాయ శాఖ సీనియర్ అధికారులతో కలిసి త్వరలో సందర్శిస్తానని మంత్రి తెలిపారు. ఆలయానికి అవసరమైన అభివృద్ధి పనులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ వెంగమాంబ అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి మొదటి విడతగా రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
శ్రావణమాసంలోనే ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మొదటి విడత పనులు పూర్తయిన అనంతరం రెండో విడతగా రూ.6.50 కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నియోజకవర్గంలోని పలు అమ్మవారి దేవాలయాలకు ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు,ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.




