Nellore: పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించండి విక్రమ్ రెడ్డి

Nellore: డీసీపల్లి వేలం కేంద్రంలో పొగాకు రైతుల కష్టాలను తెలుసుకున్న విక్రమ్ రెడ్డి. ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 14 July 2026 2:08 PM IST
Nellore
X

Nellore: పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించండి విక్రమ్ రెడ్డి

నెల్లూరు: రాష్ట్రంలో వర్జీనియా పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా జోక్యం చేసుకోవడం లేదని, ముఖ్యమంత్రి ధరలు పెంచాలని, తిరస్కరణలు ఉండకూడదని ఆదేశించిన కొద్ది రోజులకే పరిస్థితి మరింత దిగజారడం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం చెబుతున్న కనీస ధర రూ.200 కూడా రైతులకు అందని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేలం కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లాడి పొగాకు ధరలు పడిపోవడం, అధిక తిరస్కరణలు, కొనుగోళ్ల మందగమనంతో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.

అంతకు ముందుగా డీసీపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి సునీల్ కుమార్ తో వేలం ప్రక్రియ జరుగుతున్న విధానం, ధరల తగ్గుముఖం తదితర విషయాలపై చర్చించారు. పొగాకు రైతులను ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం తీసుకునేలా చూడాలంటూ వినతిపత్రం సమర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పొగాకు ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని, అయినా దానిని పండించే రైతు మాత్రం నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. డీసీపల్లి వేలం కేంద్రంలో 100 రోజులు పూర్తయినా కేవలం 17 శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేయడం ఆందోళనకరమన్నారు. ఇంకా 83 శాతం పొగాకు రైతుల గోదాముల్లోనే ఉండిపోవడం చూస్తే కొనుగోలు ప్రక్రియ ఎంత మందగించిందో అర్థమవుతోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నెలల్లో కేవలం 32 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. వేలం కేంద్రాల్లో 50 శాతానికి పైగా బేళ్లను 'నో బిడ్' పేరుతో తిరస్కరిస్తున్నారని, రైతు శ్రమకు తగిన విలువ ఎందుకు దక్కడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గత ఏడాది బ్రైట్ పొగాకుకు రూ.280 నుంచి రూ.360 వరకు ధర లభించగా, ప్రస్తుతం రూ.160 వరకు పడిపోవడం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందన్నారు. ప్రస్తుతం బ్రైట్‌కు సగటున రూ.243, మీడియంకు రూ.216, లో గ్రేడ్‌కు రూ.187 మాత్రమే వస్తోందని, కనీసం బ్రైట్‌కు రూ.300, మీడియంకు రూ.280, లో గ్రేడ్‌కు రూ.250 ధర వస్తేనే రైతు గట్టెక్కే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.

ఒక్కో ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టిన రైతుకు సరైన ధర లేకపోవడంతో భారీ నష్టం తప్పడం లేదన్నారు. ఒక్కో బార్న్‌కు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసిన రైతుకు ప్రస్తుతం సుమారు రూ.10 లక్షలే తిరిగి వస్తుండటంతో దాదాపు రూ.5 లక్షల నష్టం ఎదురవుతోందని తెలిపారు.

పొగాకు కంపెనీలు ఒకే విధమైన ధరలతో కొనుగోళ్లు నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, పొగాకు బోర్డు వాటిని ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. పొగాకు బోర్డు రైతుల ప్రయోజనాలను కాపాడేలా పనిచేస్తోందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాది నల్లనేలల ప్రాంతంలో పొగాకు ధర కిలోకు గరిష్ఠంగా ఒక సీజన్ లో రూ.456 వరకు నమోదైందని, కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్క్‌ఫెడ్ ద్వారా రూ.200 కోట్లు కేటాయించి రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వం ప్రత్యేక జోక్యం చేసుకుని రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

నారా చంద్రబాబునాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన వర్షాలు పడే పరిస్థితి దాదాపు కనిపించదని, గతంలో ఆయన పాలనా కాలాన్ని పరిశీలిస్తే అనావృష్టితో రైతులు అల్లాడారని, ప్రస్తుతం కూడా అదే కొనసాగుతున్న నేపధ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధి సైతం వర్షాలు కురవకపోతేనే మరింత ప్రకృతి సంపదను దోచుకోవచ్చుననే ఉన్నారని, ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక, మట్టిని ఎలా కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారో, అదే విధంగా రైతులకు ఆదుకునేందుకు కూడా కొంత మేర చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వమే లేదా రైతుల సహకార సంఘాల ద్వారా నేరుగా పొగాకు కొనుగోలు చేయాలని విక్రమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను నష్టపరుస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు సమన్వయంతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే ప్రకాశం, నెల్లూరు సహా అన్ని పొగాకు జిల్లాల రైతులతో కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story