Nellore: సైబర్ నేరాల పట్ల అప్రమత్తం.. ఎస్పీ అజిత వేజెండ్ల అవగాహన
Nellore: ఉదయగిరిలో ఎస్పీ అజిత వేజెండ్ల నేతృత్వంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక. ప్రజల వద్దకే వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ.
Nellore: సైబర్ నేరాల పట్ల అప్రమత్తం.. ఎస్పీ అజిత వేజెండ్ల అవగాహన
నెల్లూరు జిల్లా: ఉదయగిరి కేంద్రంలో ప్రజలకు చేరువగా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీదారుల వద్దకే వెళ్లి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించడం విశేషంగా నిలిచింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కేంద్రానికి100 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఉదయగిరి ప్రాంతంలోనే ఈ వేదికను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశాన్ని పోలీస్ శాఖ చూపించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజల నమ్మకాన్ని పొందడం, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.అదేవిధంగా, సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజీలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.వ్యక్తిగత, బ్యాంక్ సంబంధిత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని అవగాహన కల్పించారు. ప్రజల సహకారం ఉంటేనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు.




