Nellore: సీపీఐ నేత దశరథ రామయ్య మృతిపై మంత్రి నారాయణ భావోద్వేగం!
Nellore: ఉమ్మడి ఏపీ చేనేత కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పముజుల దశరథ రామయ్య మృతి పట్ల మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Nellore: సీపీఐ నేత దశరథ రామయ్య మృతిపై మంత్రి నారాయణ భావోద్వేగం!
నెల్లూరు: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పముజుల దశరథ రామయ్య మృతి పట్ల రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
సంతపేటలోని సీపీఐ కార్యాలయంలో ప్రజల సందర్శనకోసం ఉంచిన పముజుల దశరథ రామయ్య భౌతిక కాయాన్ని ఆదివారం మంత్రి నారాయణ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, పముజుల దశరథ రామయ్య మృతి, నెల్లూరు జిల్లాకు తీరని లోటని అన్నారు. సుమారు 40 సంవత్సరాల పాటు సౌత్ మోపూరు గ్రామానికి సర్పంచ్‌గా, ఎంపీటీసీగా సేవలందించి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
పేదల పక్షాన నిలబడి భూ పోరాటాల్లో తనదైన పాత్ర పోషించారని, సామాన్య కార్యకర్తగా సీపీఐలో ప్రస్థానం ప్రారంభించి ప్రజానాయకుడిగా ఎదిగిన అరుదైన వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పముజుల దశరథ రామయ్య మృతితో సౌత్ మోపూరు గ్రామం పెద్దదిక్కును కోల్పోయిందన్నారు.
వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని వారికి భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.మంత్రితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,సిటీ టీడీపీ నేతలు పముజులకు నివాళులు అర్పించారు.




