Nellore: నెల్లూరులో రాజకీయ విశ్లేషకుడు యనమల నాగేశ్వరరావు ప్రెస్ మీట్!

Nellore: నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ విశ్లేషకుడు యనమల నాగేశ్వరరావు మీడియా సమావేశం.. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు తగవని హితవు.

A Praveen, Nellore
Published on: 12 Sept 2026 1:32 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో రాజకీయ విశ్లేషకుడు యనమల నాగేశ్వరరావు ప్రెస్ మీట్!

Nellore: ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందని, వ్యక్తిగత దూషణలు, పరస్పర ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉండకూడదని రాజకీయ విశ్లేషకుడు యనమల నాగేశ్వరరావు అన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయ నాయకులు నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష నాయకులు నిర్మాణాత్మకంగా ప్రశ్నించుకోవాలని, అయితే వ్యక్తిగత విమర్శలు, దూషణలకు రాజకీయాలను వేదికగా మార్చడం సరికాదని హితవు పలికారు.

నేటి రాజకీయ నాయకుల మాటలు, వ్యవహారశైలి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలి కానీ రాజకీయాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి తీసుకురాకూడదని పేర్కొన్నారు. యువతీ యువకులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజా సమస్యలపై గళం విప్పడం ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని, అయితే సమస్యను ప్రశ్నించే క్రమంలో వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదని యనమల నాగేశ్వరరావు సూచించారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చలు, పరస్పర గౌరవం, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore