Nellore: గోనుపల్లికి చేరిన పెంచలకోన నాథుడు.. అల్లుడికి గిరిజనుల ఘనస్వాగతం
Nellore: నెల్లూరు జిల్లా పెంచలకోన బ్రహ్మోత్సవాల అనంతరం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి సతీసమేతంగా గోనుపల్లి గిరిజన కాలనీకి చేరుకున్నారు.
Nellore: గోనుపల్లికి చేరిన పెంచలకోన నాథుడు.. అల్లుడికి గిరిజనుల ఘనస్వాగతం
Nellore: నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో ఆరు రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెనుశిల లక్ష్మి నరసింహస్వామి, చెంచులక్ష్మిని వివాహం చేసుకుని సతీసమేతంగా చెంచులక్ష్మి స్వగ్రామమైన గోనుపల్లి గిరిజన కాలనీకి చేరుకున్నారు. మండలంలోని గోనుపల్లి గ్రామంలో ఉన్న శ్రీపెనుశిల లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను బ్రహ్మోత్సవాల ముందు రోజు పెంచలకోనకు పల్లకీలో తీసుకెళ్లి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత మళ్లీ గోనుపల్లి గ్రామానికి తీసుకురావడం అనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా కోనలోని అలంకార మండపం వద్ద స్వామి, అమ్మవార్లను పల్లకీలో కొలువుదీర్చి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆనంతరం అర్చకులు పెంచలకోన ముఖమండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. స్వామి. అమ్మవార్లను గోనుపల్లి గ్రామంలోని గిరిజన కాలనీ వద్ద ఉన్న చెంచురాజు ఇంటికి దొడ్డిదారిలో తీసుకొచ్చారు. శ్రీవారి కల్యాణం అనంతరం స్వామి వారు దొంగదారిలో గ్రామానికి వచ్చారని నానుడి.
పెంచలస్వామి గిరిజన వనిత అయిన చెంచులక్ష్మిని వివాహం చేసుకోవడంతో ఆయనను తమ అల్లుడిగా భావిస్తారు. గోనుపల్లి నుంచి ఉత్సవ విగ్రహాలు కోనకు వెళ్లే సమయం లో స్వామిని గిరిజనులు పెళ్లికొడుకును చేసి అల్లుడికి ఇవ్వాల్సిన కట్నకానుకల కింద ఆరి మొలతాడు. ఇంజేటి గడ్డ, పుట్ట తేనె మొదలైనవి స్వామివారికి సమర్పిస్తారు. అలాగే స్వామి తిరిగి వచ్చే సమయంలో అడవి ఫలాలను అందించారు.
శ్రీవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజన కాలనీలోనే ఉంచడంతో గిరిజనులు తమ కొత్త అల్లుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగ జరుపుకుంటారు. సాయంత్రం గోనుపల్లిలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పీర్ల సోమయ్య యాదవ్, ప్రధానార్చకులు సీతా రామయ్యస్వామి,పెంచలయ్య స్వామి, శశి స్వామి, తదితరులు పాల్గొన్నారు.




