Paderu: గిరిజన రైతులకు తేనె పట్టు పరికరాలు, పిండి మిల్లుల పంపిణీ

Paderu: పాడేరు ఏరువాక కేంద్రంలో గిరిజన రైతుల జీవనోపాధి కోసం తేనె పట్టు పరికరాలు, మెరుగైన విత్తనాలు, పిండి మిల్లును పంపిణీ చేశారు.

SAI, PADERU
Published on: 2 Sept 2026 10:45 PM IST
Paderu
X

Paderu: గిరిజన రైతులకు తేనె పట్టు పరికరాలు, పిండి మిల్లుల పంపిణీ

పాడేరు: గిరిజన రైతుల జీవనోపాధి, వ్యవసాయ ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ట్రైబల్ సబ్ ప్లాన్ (TSP) కింద పాడేరులోని ఏరువాక కేంద్రంలో గిరిజన రైతులకు తేనె పట్టు పరికరాలు, మెరుగైన విత్తనాలు, పిండి మిల్లును పంపిణీ చేశారు.

ఆర్‌ఏఆర్‌ఎస్ చింతపల్లి, ఏడీఆర్ డా. ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన రైతులకు జేఎన్‌ఎస్–28 రకం నువ్వుల మెరుగైన విత్తనాలను అందజేశారు. మెరుగైన విత్తనాలను వినియోగించడం ద్వారా పంట దిగుబడులు, రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా గిరిజన రైతులు సాధారణంగా చేపట్టే వరి, పసుపు తదితర పంటలతో పాటు తేనె పట్టు ద్వారా అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహించేందుకు ట్రైబల్ సబ్ ప్లాన్ కింద తేనె పట్టు పరికరాలను పంపిణీ చేశారు.

తేనె పట్టు కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా గిరిజన కుటుంబాలకు అదనపు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

పోస్ట్ హార్వెస్ట్ నష్టాల నివారణకు పిండి మిల్లు

గిరిజన రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులలో పోస్ట్ హార్వెస్ట్ నష్టాలను తగ్గించడంతో పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు పిండి మిల్లును అందజేశారు. దీని ద్వారా రైతులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే బియ్యం, రాగులు, కొర్రలు, సామలు తదితర ధాన్యాలను స్థానికంగానే ప్రాసెస్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

దీంతో రైతులకు ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి మెరుగైన ఆదాయం పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పంటల వైవిధ్యీకరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, తేనె పట్టు వంటి అనుబంధ జీవనోపాధి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. ప్రదీప్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త డా. ఉమామహేష్, స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ డా. కళ్యాణి, శాస్త్రవేత్త డా. సందీప్ నాయక్, గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU

Next Story