Kadirinenipalli: పౌరహక్కుల దినోత్సవానికే కుల వివక్ష అధికారుల గైర్హాజరు

Kadirinenipalli: మర్రిపాడు పౌరహక్కుల దినోత్సవానికి అధికారులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం. ఇది కుల వివక్షేనంటూ కదిరినేనిపల్లి ఎస్సీ, ఎస్టీ కాలనీవాసుల మండిపాటు!

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 31 July 2026 1:07 PM IST
Kadirinenipalli
X

Kadirinenipalli: పౌరహక్కుల దినోత్సవానికే కుల వివక్ష అధికారుల గైర్హాజరు

పౌరహక్కుల దినోత్సవానికే కుల వివక్ష..? ఎస్సీ,ఎస్టీ కాలనీలో సమావేశానికి కీలక శాఖల అధికారుల గైర్హాజరు.. గ్రామస్తుల ఆగ్రహం.

ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను నేరుగా తెలుసుకొని, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం–గ్రామసభ కు పలు కీలక శాఖల అధికారులు గైర్హాజరు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ జీవో నెం.128 మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలపై నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామంలో తహసీల్దార్ కె.సి.హెచ్.వి. అనిల్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. అయితే సమావేశానికి తహసీల్దార్,ఎంపీడీఓ మినహా విద్యుత్, ఆరోగ్య, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, ఐసీడీఎస్ తదితర కీలక శాఖల అధికారులు గైర్హాజరుకావడం గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిర్వహించే అధికారిక సమావేశాలకు సైతం సంబంధిత అధికారులు హాజరుకాకపోవడం తమ పట్ల కుల వివక్షను ప్రతిబింబిస్తోందని గ్రామస్తులు ఆరోపించారు.పౌరహక్కుల దినోత్సవం ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను అన్ని శాఖల సమక్షంలో విని, అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టడం. కానీ ప్రజల సమస్యలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న శాఖల అధికారులు గైర్హాజరుకావడంతో సమావేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.సమావేశంలో ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య, విద్యుత్ అంతరాయాలు, పాఠశాలలో నాలుగో, ఐదో తరగతుల ఏర్పాటు, వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు, పెన్షన్లు, ఇంటి స్థలాలు, భూ సమస్యలు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, స్మశానవాటికకు స్థలం కేటాయింపు తదితర అంశాలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే సంబంధిత శాఖల అధికారులు లేకపోవడంతో సమస్యలకు తక్షణ స్పందన లభించలేదని వారు పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలని ఆదేశించినా, సంబంధిత శాఖల అధికారులు గైర్హాజరుకావడం కలెక్టర్ ఆదేశాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా, అధికారులలో తమ పట్ల కుల వివక్ష కొనసాగుతోందనే భావనను మరింత బలపరిచిందని గ్రామస్తులు ఆరోపించారు. గైర్హాజరైన అధికారులపై జిల్లా యంత్రాంగం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story