Nellore: మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అప్రజాస్వామికం మైనార్టీ నేతలు
Nellore: గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్‌ను ఖండిస్తూ నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మైనార్టీ నేతలు.
Nellore: మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అప్రజాస్వామికం మైనార్టీ నేతలు
నెల్లూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ముస్తఫా అరెస్ట్‌ను ఖండిస్తూ నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హంజా హుస్సేనీ, జిల్లా అధ్యక్షుడు షేక్ సిద్ధిక్, కార్పొరేటర్ సత్తార్, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్ , తదితరులు మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వంపై, స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ముస్లిం నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి మచ్చలేని ముస్తఫా వంటి సీనియర్ నాయకుడిని అనవసరంగా అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముస్లిం నేతలను, మైనార్టీ వర్గాలను భయాందోళనలకు గురిచేసే విధంగా ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు మైనార్టీలను గౌరవించాల్సింది పోయి, వారిపై కక్షసాధింపులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమై కొన్ని నెలలు మాత్రమే అయ్యిందని, ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని గుర్తుచేశారు. ముస్లిం, మైనార్టీలంతా ఏకమై రాబోయే రోజుల్లో కూటమి పార్టీలకు (తెలుగుదేశం, జనసేన, బిజెపి) చెప్పుతో కొట్టినట్లు తగిన గుణపాఠం చెబుతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
మైనార్టీల జోలికి వస్తే సహించేది లేదని, వెంటనే ముస్తఫాపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేసి ఆయనను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముస్తఫా ఎంతో సౌమ్యుడని, ఎవరికీ హాని తలపెట్టని మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.
ముస్తఫా తన వ్యాపార నిమిత్తం ఒక వ్యక్తికి సరుకు కోసం ₹36 లక్షల రూపాయలు చెల్లించారని, సరుకు లేదా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. అయితే, స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి, బాధితుడైన ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు మోపడం దారుణమన్నారు.
ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేదా సెర్చ్ వారెంట్ లేకుండా సుమారు 250 మంది పోలీసులు ముస్తఫా నివాసంలోకి జొరబడ్డారని ఆరోపించారు. మొదటి అంతస్తులో ఉన్న మహిళలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రశ్నించిన వారిని నెట్టివేసి గందరగోళం సృష్టించారని విమర్శించారు.
ఈ ఘటనలో ముస్తఫాతో పాటు ఆయన కుమారుడిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని నేతలు తీవ్రంగా నిరసించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ముస్లిం, మైనార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ ఘోరమైన చర్య అని, ఇది కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని మైనార్టీ నాయకులు ఆరోపించారు.
పెద్దకాకాని ప్రాంతంలో సుమారు 74 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసిందని, దానికి వ్యతిరేకంగా ముస్తఫా గళమెత్తడం వల్లే ఈ అరెస్ట్ జరిగిందని నేతలు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రభుత్వం వక్ఫ్ భూములను ఆక్రమించేందుకు లేదా ప్రభుత్వ పరిధిలోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మైనార్టీ నేతలు మండిపడ్డారు.
వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం ముస్తఫా మరియు వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారని, దాంతో ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్న మైనార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం తగదని, ముస్తఫాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.




