Nellore: నెల్లూరు రూరల్‌లో ప్రేమ్‌చంద్ దారుణ హత్య కేసు ఛేదన!
Nellore: నెల్లూరు రూరల్ పరిధిలో ప్రేమ్‌చంద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. A1 జిషాన్, A2 దినేష్‌తో సహా ఐదుగురు నిందితుల అరెస్ట్, ఆయుధాలు స్వాధీనం.
Nellore: నెల్లూరు రూరల్‌లో ప్రేమ్‌చంద్ దారుణ హత్య కేసు ఛేదన!
Nellore: నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన క్రైమ్ నం. 187/2026 – సెక్షన్ 103(1) r/w 3(5) BNS హత్య కేసును పోలీసులు ఛేదించి, ఈ నేరానికి పాల్పడిన ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు నేరానికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, ఒక ద్విచక్ర వాహనం, రక్తపు మరకలు గల దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లండన్ లేఔట్, అశోక్ నగర్, నెల్లూరు–కొడురుపాడు రోడ్డుకు దక్షిణ వైపున, 4వ మైలు, నెల్లూరు రూరల్ మండలం, SPSR నెల్లూరు జిల్లా.
నిందితుల వివరాలు
A1 – షేక్ జిషాన్, S/o చాన్ బాషా, దొరతోపు కాలనీ, నెల్లూరు రూరల్ మండలం.
A2 – నన్నం దినేష్ కుమార్, S/o చంద్రశేఖర్, దొరతోపు కాలనీ, నెల్లూరు రూరల్ మండలం.
A3 – పంచిరెడ్డి హేమంత్, S/o మల్లేశ్వరరావు, DGP కళ్యాణ మండపం సమీపం, కిసాన్ నగర్, నెల్లూరు నగరం.
A4 – వేమా అపర్ణ, దొరతోపు కాలనీ, నెల్లూరు రూరల్ మండలం.
A5 – పునుగు సిద్ధ గణేష్, కిసాన్ నగర్, నెల్లూరు నగరం.
"సంఘటనకు దారితీసిన పరిస్థితులు"
కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరు రూరల్ మండలానికి చెందిన వంశీ, అపర్ణ అనే ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో కొంతకాలం కలిసి జీవించాడు. అనంతరం A2 నన్నం దినేష్ కుమార్, అపర్ణకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించడంతో వంశీ మరియు అపర్ణ మధ్య విభేదాలు ఏర్పడి, చివరకు వంశీ ఆమెను విడిచి వెళ్లిపోయాడు.
వంశీ వెళ్లిపోయిన అనంతరం అపర్ణ A2 దినేష్‌తో కలిసి నివసించడం ప్రారంభించింది. ఈ విషయంపై వంశీ స్నేహితుడైన ఎద్దు సీనయ్య @ శ్రీను, వంశీ అపర్ణను విడిచి వెళ్లడానికి A2 దినేష్ కారణమని భావించి అతనిపై కక్ష పెంచుకున్నాడు.
దినేష్‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తులను శ్రీను బెదిరిస్తూ, దినేష్‌తో ఎటువంటి సంబంధాలు కొనసాగించవద్దని హెచ్చరిస్తూ ఉండేవాడు. దినేష్ మంచివాడు కాదని ఇతరులకు చెప్పేవాడు. కొన్ని సందర్భాల్లో తన వద్ద పనిచేస్తున్న మృతుడు కూడారి ప్రేమ్‌చంద్ @ చందును ఉపయోగించి దినేష్‌తో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులను బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇటీవల A1 షేక్ జిషాన్, A3 పంచిరెడ్డి హేమంత్‌లు A2 దినేష్‌తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం శ్రీనుకు తెలియడంతో, మృతుడు చందు ద్వారా A1 జిషాన్, A3 హేమంత్‌లను బెదిరించి దినేష్‌తో స్నేహం చేయవద్దని హెచ్చరించాడు.
మృతుడు చందు తన తరపున A1 జిషాన్, A3 హేమంత్‌లను బెదిరించిన విషయం A2 దినేష్‌కు తెలియడంతో, దినేష్ చందుపై ఆగ్రహం పెంచుకుని అతనిపై కక్ష పెంచుకున్నాడు.
"పథకం ప్రకారం హత్య"
10.09.2026న మృతుడు చందు మరియు A1 షేక్ జిషాన్ మధ్య గొడవ జరిగి, ఇరువురు ఒకరినొకరు కొట్టుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సంఘటనతో వారి మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రతరం అయ్యాయి.
11.09.2026 రాత్రి 8.00 గంటలకు A1 షేక్ జిషాన్ ఫోన్ చేసి పిలవడంతో, మృతుడు చందు మద్యం సేవించేందుకు నెల్లూరు రూరల్ మండలం, అశోక్ నగర్, 3వ మైలు పరిధిలోని లండన్ లేఔట్‌లో ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లాడు.
అక్కడ అప్పటికే పథకం వేసుకున్న A1 షేక్ జిషాన్, A2 దినేష్ మరియు A3 పంచిరెడ్డి హేమంత్‌లు మృతుడు చందుపై గతంలో ఏర్పడిన కక్షతో మద్యం సేవించిన అనంతరం కత్తులతో దాడి చేశారు.
ఛాతి, పొత్తికడుపు, ఎడమ చేతిపై పలుమార్లు కత్తిపోట్లు కలిగించడంతో మృతుడు చందు అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
"కేసు నమోదు – దర్యాప్తు"
మృతుడు రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లి, ఫిర్యాదుదారు కూడారి బుజ్జమ్మ తన బంధువులతో కలిసి మృతుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో లండన్ లేఔట్‌లోని ఖాళీ స్థలంలో చందు మృతదేహాన్ని గుర్తించారు.
మృతుడి తల్లి కూడారి బుజ్జమ్మ ఇచ్చిన ఫిర్యాదు, సంఘటనా స్థల పరిస్థితుల ఆధారంగా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.187/2026 u/s 103(1) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
"సవాలుగా తీసుకుని కేసును ఛేదించిన పోలీసులు"
ఈ హత్య కేసును సవాలుగా తీసుకుని, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) CH. సౌజన్య సూచనలతో, నెల్లూరు రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ K. వెంకట రెడ్డి మరియు ఆయన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా మృతుడు మరియు నిందితుల మధ్య ఉన్న పూర్వ విభేదాలు, శ్రీను ద్వారా A1 జిషాన్ మరియు A3 హేమంత్‌లకు మృతుడి ద్వారా అందిన బెదిరింపులు, వాటి కారణంగా A2 దినేష్ మృతుడిపై పెంచుకున్న కక్ష, 11.09.2026న మృతుడి కదలికలు, A1 నుండి A3లను కలిసిన పరిస్థితులు తదితర అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
సాక్షుల వాంగ్మూలాలు, లభించిన ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. తదుపరి దర్యాప్తులో A4 అపర్ణ కూడా ఈ నేరానికి సంబంధించి A2 దినేష్‌ను ప్రోత్సహించినట్లు/ఉసిగొల్పినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా నేరానికి సహకరించిన A5 సిద్ధా, ముఖ్యంగా నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని సమకూర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఐదుగురు నిందితుల అరెస్ట్ – కీలక ఆధారాలు స్వాధీనం
దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా A1 షేక్ జిషాన్, A2 నన్నం దినేష్ కుమార్, A3 పంచిరెడ్డి హేమంత్‌లను 14.09.2026 ఉదయం 11.45 గంటలకు కొరూరుపాడు గ్రామంలోని మానులమ్మ దేవాలయం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు మరియు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
అలాగే కేసు దర్యాప్తులో భాగంగా A4 అపర్ణ మరియు A5 సిద్ధా గణేష్‌లను 14.09.2026 మధ్యాహ్నం 1.00 గంటలకు దొరతోపు కాలనీ వద్ద అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రక్తపు మరకలు గల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
"నేరస్తులపై కఠిన చర్యలు"
హత్యలు, నేర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన నెల్లూరు రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ రావు, CI వెంకట్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.




